
సాక్షి, పెద్దపల్లి(పాలకుర్తి): ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారు పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో సజ్జనార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
స్థానికుల కథనం ప్రకారం.. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఎగ్గె నాగరాజు (38), అతని భార్య లక్ష్మి, అంతర్గాం మండలం రాయదండికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి వారి సొంత ఆటోలో కరీంనగర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి రామగుండంకు తిరుగుపయనమయ్యారు. ధర్మారం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే వీరి ఆటోను వెనుక నుంచి వచ్చిన సజ్జనార్ కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.
భూమయ్య, నూనె లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ సంఘటనలో సజ్జనార్ కుడిచేతికి స్వల్పంగా గాయమైంది. ఫోర్‌లైన్ రహదారిపై ఆటో ఒక్కసారిగా అడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బసంత్‌నగర్ ఎస్సై శివాణిరెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి: (నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం)