సాక్షి, హైదరాబాద్: పొరుగురాష్ట్రాల్లోనూ చక్రం తిప్పాలని టీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపిన టీఎస్ ఆర్టీసీ తాజాగా కర్ణాటకకు కూడా బస్సుల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇటీవలే కర్ణాటక ఆర్టీసీ అధికారులతో బెంగళూరులో చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా కర్ణాటక పరిధిలో మరో 30 వేల కిలోమీటర్ల మేర నిత్యం అదనంగా బస్సులు తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అదనంగా వంద బస్సులు అవసరమవు తాయని తేల్చారు. దీనివల్ల రోజువారీ ఆదాయంలో రూ.25 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు, బెల్గాం, బీజాపూర్, యాద్గీర్, బీదర్, రాయచూర్ లాంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ 500 బస్సులను కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా ఎక్కువ గానే ఉంది. కర్ణాటకలోని మూడు ఆర్టీసీలు కూడా హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. వాటికి కూడా ఆదరణ బాగా ఉంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాయి.
2008లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఎస్ ఆర్టీసీతో విడిగా ఒప్పందం చేసుకోలేదు. దీంతో ఇటీవలే కర్ణాటక అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో అధికారులు, బెంగళూరు వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు.
స్లీపర్ బస్సుల కేటాయింపు
ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులు కొంటోంది. మరో 108 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. వీటిలో కొన్నింటిని కర్ణాటకకు అదనంగా తిప్పే సర్వీసులకు కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, రాయచూర్ లాంటి ప్రాంతాలకు వాటిని తిప్పాలని భావిస్తోంది. దూరప్రాంతాలు కావటంతో జనం స్లీపర్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద స్లీపర్ బస్సుల్లేక చాలామంది ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టే స్లీపర్ బస్సులతో ఆ ప్రయాణికులను తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment