
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల శిరీష–వెంకటేశ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడోసారి గర్భందాల్చిన శిరీషకు ప్రస్తుతం ఎనిమిదినెలలు, శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ముస్తాబాద్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. వైద్యులు శిరీషకు స్కానింగ్ చేసి కవలలు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆపరేషన్ చేయగా, కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని శిరీషకు వైద్యం అందించిన డాక్టర్ అనూష తెలిపారు. ఈ కవలలు రెండు కిలోల బరువుతో జన్మించగా.. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించారు. కాగా, అవిభక్త కవలలను చూసి శిరీష–వెంకటేశ్ దంపతులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment