సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్‌పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు.
నిజామాబాద్ మహిళ.. దుబాయ్‌లో సహజీవనం...
నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్‌లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది.
ఆరేళ్లకు అతడు వస్తాననడంతో...
తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్‌లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్‌తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్‌పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్‌లో ఆమెకు అప్పగించారు.
ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక...
దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్‌లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది.
Comments
Please login to add a commentAdd a comment