సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.
పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. సీజన్‌లో నమోదు కావాల్సిన స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై ముందస్తుగా వేసవి హెచ్చరిక మాదిరిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చట్టబడింది.
దీంతో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణం కంటే కిందకు పడిపోయాయి. వేసవి సీజన్ చివరి దశలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉన్నప్పటికీ... తర్వాత పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 15.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment