సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని గుర్తించారు. ఇద్దరూ దుబాయ్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అందులో ఒక వ్యక్తి (55 ఏళ్లు) ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ వచ్చారు. అలాగే మరో వ్యక్తి (26 ఏళ్లు) ఈ నెల 26వ తేదీన వచ్చారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.
సాధారణ వేరియంట్ సోకిందా లేక బీఎఫ్ 7 ఉందా అనేది తెలుసుకోనున్నారు. కాగా, వారిని ఐసోలేషన్‌కు తరలించారా లేదా అన్న వివరాలను వైద్య వర్గాలు వెల్లడించడంలేదు. ఆ ఇరువురి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, నమోదవుతున్న కరోనా కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 25 నమూనాలను లేబొరేటరీకి పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అందులో 11 ఎక్స్‌బీబీ ఉపరకం వేరియంట్ కేసులు, మిగిలినవి బీఏ 2 ఉపరకం కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు రాష్ట్రంలో బుధవారం 5,580 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment