త్వరలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
రెండైనా గెలిచేందుకు బీజేపీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటినుంచే టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను పెద్దసంఖ్యలో చేర్పించేలా కార్యాచరణ అమలుచేయాలని తీర్మానించింది. ఓటర్ల నమోదుకు దరఖాస్తులను పార్టీ ఇప్పటికే పెద్దసంఖ్యలో ముద్రించి సిద్ధం చేసింది.
ఈ దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపించి టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేలా చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు (టీచర్స్, గ్రాడ్యుయేట్స్ చెరో సీటు), వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి బీజేపీ 4 ఎంపీ, 7 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించడం తెలిసిందే. ఈ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ సీట్లను కూడా కచ్చితంగా గెలుపొందడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించాలని పట్టుదలతో పార్టీ నేతలున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు పార్టీపరంగా ఒక ఇన్‌చార్జిని నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ అభ్యరి్థగా సుగుణాకరరావు, టీచర్స్ అభ్యరి్థగా మోహన్‌రెడ్డి పోటీ చేయడం తెలిసిందే. బీజేపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్–2024 పై నిర్వహించిన మరో సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అరవింద్ మీనన్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, ధర్మారావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment