సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తిగా దృష్టి సారించింది. పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘మిషన్ తెలంగాణ’ అమలుకు చర్యలు మొదలుపెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార సాధనే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసింది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను రప్పించి.. ఒక్కొక్కరికి మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు నేరుగా అమిత్‌షాకే నివేదికలు అందించేలా వివిధ బృందాలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు పలు అంశాలపై సర్వేల ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని అమిత్‌షా కార్యాలయానికి చేరవేస్తున్నారు. ప్రజా సమస్యలపై చేపట్టే నిరసనలు, ఆందోళన వంటివి కూడా పూర్తిగా పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి.
ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు...
ఇతర రాష్ట్రాలకు చెందిన 26మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి, ఒక్కొక్కరిని మూడు సీట్లకు ఇం చార్జీలుగా నియమించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా వారు తెలంగాణ లో పనిచేస్తారని తెలుస్తోంది. వీరంతా కూడా ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలను చూడనున్నారు. రాష్ట్రా నికి చెందనివారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా రాగద్వేషాలకు తావులేకుండా ఎన్నికల కార్యచరణను అమలు చేయవచ్చని నాయకత్వం భావిస్తోంది.
అలాగే సమన్వయం కోసం.. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని, పార్టీ కోసం పనిచేసే సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే వీరంతా ఎన్నికలు పూర్తయ్యే దాకా పూర్తి సమయం పార్టీకే కేటాయించి పనిచేయాలనే నిబంధన పెట్టనున్నారు. ఇప్పటికే 19ఎస్సీ, 12ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యా చరణ నిమిత్తం అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో 2 ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించింది.
సర్వేలతో నూతనోత్సాహం...
రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభా స్థానాల్లోని పరిస్థితులపై ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ రూపంలో వస్తు న్న సమాచారం బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతు న్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న పార్టీగా బీజేపీకి ఆదరణ పెరుగుతున్న తీరు స్పష్టమవుతోందని అంటున్నారు. ప్రజా సమస్యలు, ఇతరత్రా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇదే సమయంలో బీజేపీ ఇమేజీ పెరుగుతున్నట్లు సర్వేల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని చెబుతున్నారు.
దీంతో జాతీయ నాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టిందని ఒక ముఖ్యనేత ‘సాక్షి’కి వెల్లడించారు. బీజేపీలో చేరేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నా.. మంచి రోజులు లేని కారణంగా చేరికలు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఉగాది తర్వాత ఇతర పార్టీల్లోంచి చేరికలు ఊపందుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment