![Union Minister Kishan Reddy Comments On Revanth Govt](/styles/webp/s3/article_images/2024/07/28/kishanreddy1.jpg.webp?itok=8PbKFNkN)
ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోని తెలంగాణ సర్కారు
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రామగుండంలో ప్రతిపాదిత మరో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ల పీపీఏపై అలసత్వం
ఈ ప్రాజెక్టు విద్యుత్ వేరే రాష్ట్రాలకు పోతే.. తెలంగాణకు తీవ్ర నష్టం
సర్కారు అలసత్వానికి.. ప్రజలెందుకు నష్టపోవాలి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘ఇందులో భాగంగా.. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023 తేదీన, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చి 2024 తేదీన ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు.
..ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్‌టీపీసీ పని ప్రారంభిస్తుంది.
ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. STPP-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే.. పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023 తేదీన, 9 జనవరి, 2024 తేదీన, 29 జనవరి, 2024 తేదీన.. ఆ తర్వాత మొన్న 29 ఏప్రిల్, 2024 నాడు లేఖలు రాస్తే.. వీటికి ట్రాన్స్‌కో నుంచి సమాధానం లభించలేదు.
ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న STPP-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్‌టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో.. దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్టీపీసీ రాసిన లేఖల సారాంశం.
30 మే 2024న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్)15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ NTPC పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది.
తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. NTPC రాస్తున్న లేఖలపై స్పందించి.. PPA చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment