‘మూసీనిద్ర’ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
అంబర్‌పేట/మలక్‌పేట: దశాబ్దాల తరబడి మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తూ..కష్టపడి కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం కూలగొడితే తామంతా ఎక్కడకు వెళ్లాలి అనే ఆవేదనలో అక్కడి ప్రజలు ఉన్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంత ప్రజలపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందని మండిపడ్డారు. వేలాదిమంది పేద ప్రజలను నిరాశ్రయులను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మూసీ బాధితుల కోసం బీజేపీ చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమంలో భాగంగా గోల్నాక డివిజన్ పరిధిలోని తులసీరామ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిద్రించారు. ఆదివారం ఉదయం నిద్ర లేచినంతరం బస్తీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మూసీతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తాను గమనించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.
వందేళ్ల క్రితం మూసీనదికి నిజాం రాజు ప్రహరీ నిర్మించారని, ప్రస్తుతం అలాంటి ప్రహరీ నిర్మించి పేదల ఇళ్ల జోలికి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తాను మూసీ పక్కన నివసించే శంకరమ్మ ఇంట్లో నిద్రించి వారి ఇబ్బందులను తెలుసుకున్నానని, ఇలాంటి శంకరమ్మలు ఎంతో మంది ఆవేదనతో ఉన్నారన్నారు.
పేదల ఇళ్లకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ చేస్తామంటే బీజేపీ శ్రేణులు శ్రమదానం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రావు, అజయ్‌కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
లగచర్ల ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : డాక్టర్ లక్ష్మణ్
లగచర్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మూసారంబాగ్ శాలివాహననగర్‌లో మూసీనిద్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ బాధితులకు భరోసా కల్పించడానికి చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తూ అధికార మదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.
మూసీనీటిని శుద్ధి చేయాలని, పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేసి నల్లగొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కలింగించాలన్నారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, కొత్తకాపు అరుణా రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment