మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన..
అనాలోచిత నిర్ణయాలపై సీఎంకు హెచ్చరిక
గ్రూప్–1 పరీక్ష వాయిదా, జీవో 29ను రద్దు చేయాలంటూ కేంద్ర సహాయ మంత్రి బండి మెరుపు నిరసన
నిరుద్యోగులకు మద్దతుగా చిక్కడపల్లి రోడ్డుపై బైఠాయింపు,
ఆ తర్వాత ఊరేగింపుగా ‘చలో సెక్రటేరియట్’
మరోసారి లిబర్టీ వద్ద బైఠాయింపు
మూడుసార్లు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రుల ‘లోకల్ పాలిటిక్స్’ రాష్ట్ర రాజకీయాలకు వేడెక్కిస్తున్నాయి. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష¯Œ రెడ్డి, గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులకు మద్దతుగా హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మెరుపు నిరసన లు చేపట్టడంతో.. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పరీవాహక, హైడ్రా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే లు క్షేత్రస్థాయి పర్యటనలు, 24న రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ఆందోళనలు చేపట్టడానికి ముందే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా దీర్ఘ, స్వల్ప, తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు, నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇవి దోహదపడినట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మాపై బుల్డోజర్లు తెచ్చాక కూల్చండి: కిషన్‌రెడ్డి
మూసీ నది పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనా లోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్‌కు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్న సీఎం.. ముందుగా పేదల ఇళ్లు కూల్చ కుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తమపై బుల్డోజర్లు తీసుకొచ్చి.. అప్పుడు పేదల ఇళ్లు కూల్చాలని.. వారి ఇళ్లను కూల్చాలనుకునే ముందు తమను జైలులో పెట్టాలని కోరారు.
పాత సంజయ్ గుర్తొచ్చారు
ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. ఒక్కసారిగా రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు. ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనడం, రోడ్ల బైఠాయింపు, ఇతర రూపాల్లో ఉద్యమ కార్యాచరణను గుర్తుకు తెచ్చేలా శనివారం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటా నికి దిగారు. ప్రస్తుతం తాను హోంశాఖ సహాయమంత్రినన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి.. బీజేపీ కార్యాలయంలో తొలుత గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులతో సమావేశ మయ్యారు.
ఆ వెంటనే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అశోక్‌నగర్‌కు పయనమయ్యా రు. వెంటనే పార్టీ నాయకులు, శ్రేణులు వెంటరాగా, గ్రూప్–1 బాధితులను కలుసుకున్నారు. నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తేగానే, వారిపై ఇటీవల జరిగిన లాఠీచార్జీకి నిరసనగా అక్కడే రోడ్డుపై బైఠాయించి మెరుపు నిరసన తెలిపారు. తాను కేంద్రమంత్రినైనా.. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీజేపీ కార్యకర్తగా వారికి అండగా ఉంటా నని ప్రకటించారు. జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్–1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలివెళ్లారు. అక్కడ కొంత సేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యాక.. గ్రూప్–1 అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా మంటూ ‘చలో సెక్రటేరియట్’కు బయలుదేరారు. ఆయనతో పాటు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది ర్యాలీగా ముందుకు కదలడంతో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో చర్చలకు ప్రభుత్వం పిలిచిందనే ప్రచారం జరిగినా.. అది రూఢీ కాలేదని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ దశలో జీవో 29 రద్దు చేయాల్సిందేనంటూ సంజయ్ ప్లకార్డ్‌ను ప్రదర్శించారు. అక్కడి నుంచి ఆయనను పోలీసు బందోబస్తు మధ్య రామకృష్ణమఠం వైపు తీసుకురాగా.. అక్కడికి దగ్గరలోని ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై సంజయ్ మరోసారి బైఠాయించారు. జీవో 29 రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి నిరుద్యోగులతో కలిసి లిబర్టీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని వాహనంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడి.. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment