సాక్షి, హైదరాబాద్: మానసిక కుంగుబాటు, ఒత్తిళ్లు, ఒంటరితనం, దీర్ఘకాలిక రోగాలు, ఇతర అనారోగ్య లక్షణాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయనే విషయాన్ని వైద్య, వైజ్ఞానిక పరిశోధనలు ఇప్పటికే నిర్ధారించాయి. తాజాగా ఇలాంటి లక్షణాలు ఉన్న వారిపై కొన్ని వ్యాధులకు సంబంధించిన టీకాలు పూర్తిస్థాయి కచ్చితత్వంతో పనిచేయడం లేదని వెల్లడైంది. అమ్మవారు (స్మాల్‌పాక్స్), పోలియోలతో పాటు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న వివిధ వ్యాధుల నిరోధానికి అనేక వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీకాల కారణంగానే పోలియో పూర్తిగా పోయింది. అయితే కొన్ని వ్యాధులకు సంబంధించి గతంలో అభివృద్ధి చేసిన టీకాలు మొదలుకుని ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లతో కూడా.. మానసిక సమస్యల కారణంగా పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్ సైకాలజీ జర్నల్ ‘పర్‌స్పెక్టివ్స్ ఆన్ సైకలాజికల్ సైన్స్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనంలో దీనికి సంబంధించిన పలు అంశాలను పరిశోధకులు పొందుపరిచారు.
ప్రతి ఒక్కరిలో ఒకే విధమైన ఫలితాలు కష్టం
మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు వంటి లక్షణాలున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేస్తున్న కరోనా వ్యాక్సిన్ ద్వారా కూడా కావాల్సినంత స్థాయిలో ‘యాంటీబాడీస్’ ఏర్పడకపోయే అవకాశాలున్నాయని తెలిపారు. వాస్తవానికి వైద్య పరిశోధనల చరిత్రలోనే టీకాలు అత్యంత సురక్షితమైనవి, ప్రభావవంతంగా పనిచేసేవని ఇప్పటికే స్పష్టమైంది. ప్రస్తుతం అమెరికాలో వేస్తున్న పలు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, అయితే వీటిని తీసుకున్న ప్రతి ఒక్కరిలో వెంటనే ఒకే విధమైన ఫలితాలు, ప్రభావం చూపడం కష్టమేనని పరిశోధకులు పేర్కొన్నారు. పర్యావరణ అంశాలతో పాటు వ్యక్తుల జన్యుపరమైన అంశాలు, శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారంగా రోగనిరోధక శక్తి పెరగడం, వ్యాక్సిన్‌కు స్పందన వంటివి చోటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.
(ఫైజర్ ఎఫెక్ట్: 12 వేల మందికి కరోనా పాజిటివ్)
‘ఆర్థిక పరమైన సవాళ్లు, భవిష్యత్ పట్ల అనిశ్చితి, బంధుమిత్రులను స్వేచ్ఛగా కలుసుకోలేకపోవడం, ఒంటరితనం పెరగడం వంటివి మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు దారితీస్తోంది. తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇవన్నీ మనిషి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి..’ అని ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అన్నెలైస్ మాడిసన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత కలిగిన ఈ అంశాలపై సీనియర్ సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు తమ అభిప్రాయాలను ‘సాక్షి ’ప్రతినిధితో పంచుకున్నారు.
ప్రభావం కొంత తక్కువగా ఉండొచ్చు
‘వ్యాక్సిన్ ఇచ్చాక యాంగ్జయిటీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్న వారిలో.. మిగతావారి కంటే యాంటీబాడీస్ వృద్ధి కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ మొత్తంగా దాని వల్ల ఫలితం లేదని కాదు. సాధారణంగానే మానసిక కుంగుబాటు వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అనవసర భయాలు, ఆందోళనలకు గురికాకుండా వ్యాక్సిన్‌పై నమ్మకం పెట్టుకోవాలి. ‘స్మాల్‌పాక్స్’, పోలి యో వంటివి ఇప్పుడు పూర్తిగా లేకుండా పోవడానికి వ్యాక్సిన్లు సాధించిన ఘనతే కారణం’.
– డాక్టర్ ఎమ్.ఎస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్
హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేయాలి
‘వైరస్‌పై పోరాటంలో మానసిక ఆరోగ్యం కూడా కీలకపాత్ర పోషిస్తోంది. వాస్తవానికి అది సోకిన వారి కంటే కూడా సోకని ఎంతోమంది అది తమకు ఎక్కడ వ్యాపిస్తుందా అన్న భయంతోనే గడిపారు. తద్వారా మానసిక వత్తిళ్లకు గురయ్యారు. ఈ కారణంగా పలువురిలో రోగనిరోధకశక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌తో పాటు సైకలాజికల్ సమస్యలతో ముడిపడిన అంశాలపై ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చేలా హెల్ప్‌డెస్క్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యతనివ్వాలి’.
– డాక్టర్ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్
(చదవండి: సెకండ్ రౌండ్‌లో టీకా తీసుకోనున్న మోదీ?!)
ప్రశాంతంగా ఉంటే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది
‘మానసిక ఒత్తిళ్లతో, తెలియని భయంతో ఉన్నపుడు మన శరీరం రాబోయే ప్రమాదమో లేక ఇతర విషయాల గురించో ఆలోచిస్తుంది. కాబట్టి ఆ సమయంలో రోగనిరోధక వ్యవస్థలో పూర్తిస్థాయి స్పందన రాకపోవచ్చు. ప్రశాంత చిత్తంతో ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఉంటే మనం తీసుకునే వ్యాక్సిన్ లేదా ఎలాంటి ఔషధమైనా బెటర్‌గా పనిచేస్తుంది. వ్యాక్సినేషన్ తర్వాత మద్యం, సిగరెట్ వంటివి తీసుకున్నా, సరైన ఆహారం తీసుకోకపోయినా రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది’.
– డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment