హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ వెనక ఉన్న రూ. 250 కోట్ల విలువైన 2.5 ఎకరాల స్థలాన్ని ఓ వ్యక్తి తాను మరణించాక కోర్టులో గెలుచుకున్నాడు. రోడ్ నెం. 12లోని సర్వే నంబర్ 129/76లో శేషుబాబు అనే వ్యక్తికి 2.5 ఎకరాల స్థలం ఉంది. అయితే ఈ స్థలం తమదేనంటూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గడిచిన 40 ఏళ్లుగా సివిల్ కోర్టు, హైకోర్టుల్లో ఈ కేసు నడుస్తోంది. స్థలం తనదేనంటూ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ తీసుకున్న శేషుబాబు పోరాడుతున్న సమయంలోనే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య, కొడుకులు ఇంప్లీడ్ అయి తిరిగి కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఆధారాలను పరిశీలించిన హైకోర్టు గతేడాది అక్టోబర్‌లో సదరు స్థలం శేషుబాబుదేనంటూ తీర్పునిచ్చింది.
దీంతో శేషుబాబు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని తాను మరణించాక గెలుచుకున్నట్లు అయింది. ప్రస్తుతం ఆయన తనయులు హర్ష, విక్రమ్ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకునే కార్యక్రమాలు చేపట్టారు. అక్బర్ ఆజం అనే వ్యక్తి నుంచి ఈ భూమిని శేషుబాబు డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ తీసుకోవడం పనులు చేస్తుండగా ప్రభుత్వం అడ్డుకోవడంతో కోర్టు దాకా వెళ్లింది. ఇప్పుడు శేషుబాబుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన కుమారులు స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రివ్యూ పిటిషన్ వేశాం
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కమాండ్ కంట్రోల్ వెనక సర్వే నంబర్ 129/76లో 2.5 ఎకరాల స్థలాన్ని శేషుబాబు అనే వ్యక్తి హైకోర్టులో గెలవడం జరిగింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం, ఇందుకు సంబంధించిన తీర్పు రావాల్సి ఉంది.
– శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం
Comments
Please login to add a commentAdd a comment