
సాక్షి, పెద్దపల్లి : దారుణహత్యకు గురైన న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. మంథని మండలం గుంజపడుగులో గోదావరి ఒడ్డున శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఒకే చితిపై దంపతులిద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు. వారి నివాసం నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంత్యక్రియల్లో మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాళులర్పించారు.
మరోవైపు దంపతుల అంత్యక్రియలు పూర్తికావడంతో నిందితులను అరెస్టు చూపే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు A-1 వసంతరావు, A-2 కుంట శ్రీనివాస్, A-3 కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని మరికాసేట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment