సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రొఫెసర్ వి.వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. విద్యార్థుల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత ఓవైపు.. అక్కడి ఆందోళనలను గట్టిగా అణచివేయాలని పైనుంచి వచ్చిన ఆదేశాలు మరోవైపు.. ఆయనపై ఒత్తిడి పెంచాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సీఎంవోలోని ఓ ముఖ్యమైన అధికారికి మొరపెట్టుకున్నట్టు సమాచారం.
విద్యార్థుల ఆందోళనలు ఉధృతమై..
బాసర ట్రిపుల్ ఐటీకి కొన్నేళ్లుగా వైస్ చాన్స్‌లర్‌ను నియమించలేదు. అక్కడి తాత్కాలిక ఉద్యోగులు, భోజనాల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని భోజనం పెడుతున్నారని, పురుగుల అన్నం పెట్టినా మాట్లాడే దిక్కులేకుండా పోయిందని నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఆహారం కల్తీ అయి విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో ఇది మరింత ఉధృతమైంది.
గట్టిగా అణచివేయాలనే ఆదేశాలతో..
మరోవైపు గత నెలలో ఇన్‌చార్జి వీసీగా వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. విద్యార్థుల డిమాండ్లను వేగంగా పరిష్కరిస్తానని ఆయన వచ్చిన కొత్తలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆందోళనపై కఠినంగా వ్యవహరించాలని పైనుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే ఆందోళన బాటపట్టిన విద్యార్థులను సస్పెండ్ చేస్తామని వెంకటరమణ హెచ్చరించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదుట తాను దోషిగా నిలబడాల్సి వస్తోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.
మెస్ కాంట్రాక్టు విషయంలోనూ..
బాసర ట్రిపుల్ ఐటీలో 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి భోజనాలు అందించేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లున్నారు. వీరిలో ఒక్కరే కీలకమని, మిగతా ఇద్దరూ అతడి బినామీలేనని ఆరోపణలు ఉన్నాయి. భోజనాల పని కోసం మొత్తం 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా బాసర పరిసర ప్రాంతాలకు చెందిన వారే. మరోవైపు విద్యార్థుల డిమాండ్ మేరకు ప్రస్తుత కాంట్రాక్టర్ ను తొలగించి.. మద్రాసుకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని విద్యా శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ ప్రస్తుతమున్న స్థానిక సిబ్బంది అందరినీ తొలగించాలని.. తాను వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని తెచ్చుకుంటానని షరతు పెట్టగా.. అధికారులు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే తనకు తెలియకుండానే విద్యా శాఖ ఈ నిర్ణయాలు తీసుకుందని.. స్థానికుల దృష్టిలో మాత్రం తానే తప్పుచేసినవాడిని అవుతున్నానని ఇన్‌చార్జి వీసీ ఆందోళనకు లోనవుతున్నట్టు తెలిసింది.
కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు వచ్చాయి
ఇక్కడ స్థానిక రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా అమలు చేయాలనే నిర్ణయించుకున్నాను. బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఏమీ కోరలేదు.
– ప్రొఫెసర్ వెంకటరమణ, ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ
Comments
Please login to add a commentAdd a comment