లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేత’ | Vikarabad Collector Incident: Police Arrested Some Villagers Over Attack On Officials, See More Details | Sakshi
Sakshi News home page

లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేత’

Published Tue, Nov 12 2024 8:50 AM | Last Updated on Tue, Nov 19 2024 4:26 PM

vikarabad collector incident: Police detained some people

వికారాబాద్, సాక్షి: దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు  వచ్చిన అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయింది. దాడికి కారణమైన బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వికారాబాద్‌ వెళ్లాళని ఏడీజీ మహేశ్‌ భగవత్‌కు రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. దాడి ఘటనపై మహేశ్‌ భగవత్‌  నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘

‘‘లగచర్ల ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నాం. అధికారులపై దాడి చేసిన వారిలో బీఆర్‌ఎస్‌ నాయకుడు సురేష్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా? అని విచారణ చేస్తున్నాం. సురేష్ వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుంది. కలెక్టర్‌పైకి దూసుకువచ్చే  దృష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడిలో పలువురి అధికారులకు గాయాలయ్యాయి’’ అని అన్నారు. కలెక్టర్‌ ఘటన నేపథ్యంలో ఇవాళ.. దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు.

మరోవైపు.. లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్‌ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు  వచ్చిన అధికారులపై దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ పోలీసు బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి.

కలెక్టర్ పై మూకుమ్మడి దాడి

లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్‌ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, ‘కొడంగల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్‌ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.

ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్‌ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement