నిండుకుండను తలపిస్తున్న సాగర్ జలాశయం
సాక్షి, హైదరాబాద్/కేతేపల్లి/హుజూర్‌నగర్/నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 58,750 క్యూసెక్కులు చేరుతుండటంతో సాగర్‌లో 542.7 అడుగుల వద్ద 193.15 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా గరిష్ట నీటి నిల్వ 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 119 టీఎంసీలు అవసరం. మరోవైపు మూసీ ద్వారా కృష్ణాలోకి వరద చేరుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7,400 క్యూసెక్కులు చేరుతుండగా..
తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 10 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న ప్రవాహానికి.. పాలేరు, మున్నేరు, వైరా, కట్టలేరు ఉరకలెత్తడంతో ప్రకాశం బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 62,775 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 57,500 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శ్రీశైలంలోకి తగ్గిన వరద..
శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి 1,02,418 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో కుడిగట్టు కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 27,180 క్యూసెక్కులను, ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్పిల్ వేలో ఒక గేటును మూసివేశారు. మరో గేటును 10 అడుగుల మేర ఎత్తి 26,744 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాలు, స్పిల్ వే గేటు ద్వారా మొత్తం 85,708 క్యూసెక్కులు సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి.
గోదావరిలోనూ..
పరీవాహక ప్రాంతంలో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురవడంతో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దిగువన తుపాలకుగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీలోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తగ్గుతుండటంతో సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేణ సాధారణ స్థాయికి చేరుకుంటోంది. అక్కడ వరద మట్టం 39.3 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment