గతేడాది జూలై 21వ తేదీన కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ రోజూవారి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ పథకం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విజయవంతం కాగా.. చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. అదే వేదికపై మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి ఏడాదిలోగా ఇంటింటికీ 24గంటల నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని, కార్యక్రమాన్ని మీరే ప్రారంభించాలని కేటీఆర్‌ను కోరారు. హామీఇచ్చి ఏడాది గడిచినా సాంకేతిక అనుమతులే రాలేదు. అధికారులు వేసవికి అందిస్తామని చెబుతున్నా.. ఆచరణలో ప్రగతి కనిపించడం లేదు.
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ప్రజలకు 24 గంటల మంచినీటి సరఫరా అందని ద్రాక్షగానే మారిందని చెప్పవచ్చు. హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. పనులు ముందుకు సాగడం లేదు. పైలెట్ ప్రాజెక్టుగా మూడు ప్రాంతాలను ఎంపిక చేసిన అధికారులు పనులే ప్రారంభించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మిషన్‌భగీరథ ద్వారా నిరంతర నీటి సరఫరా సాగుతుండగా.. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ప్రణాళికలకే అధికారులు పరిమితం అయ్యారు. రూ.80కోట్ల నిధులు పనులకు కేటాయించగా.. సాంకేతిక అనుమతుల ప్రక్రియనే పూర్తిచేయలేదంటే పాలకుల పనితనానికి నిదర్శనమని చెప్పవచ్చు.
రూ.80కోట్ల నిధులు
► నగరపాలక పరిధిలో నిరంతర నీటిసరఫరా చేయడానికి స్మార్ట్‌సిటీ నుంచి రూ.80 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో తాగునీటి సరఫరాలో లీకేజీలు ఉన్నచోట పైప్‌లైన్లు వేయాలి. ఇంటర్ కనెక్షన్లు ఇచ్చి ఇంటింటా నీటిసరఫరా చేయాలి. ఇందుకు ముందుగా కాలనీల్లో డిస్టెన్స్ మీటర్ ఏరియాను ఏర్పాటు చేసి నీటిసరఫరా ఒత్తిళ్లను రికార్డు చేసి, డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
► నగరంలోని 60 డివిజన్లకు 16 రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఒక్కో రిజర్వాయర్ పరిధిని జోన్‌గా పరిగణిస్తారు. ప్రయోగాత్మకంగా భగత్‌నగర్, రాంపూర్, హౌసింగ్‌బోర్డ్‌కాలనీ జోన్లకు 24గంటల తాగునీరు అందించాలని అనుకున్నారు. ప్రస్తుతం నగరంలో 641 కిలోమీటర్ల పైప్‌లైన్లు ఉంది. 51వేలకు పైగా ఇళ్లలో, 195 పబ్లిక్ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 24గంటల నీటిసరఫరాకు అనుగుణంగా రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలను ఆధునీకరించడం, నూతన పనులు చేయడానికి నిర్ణయించారు. ఈ పనులకు డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉండగా.. సాంకేతికంగా అనుమతులు రాకపోవడంతో బ్రేక్ పడింది.
► 24గంటల నీటి సరఫరా చేయాలంటే ముందుకు నీటిలెక్కలు పక్కాగా ఉండాలి. ఇందుకు స్కాడా విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎంతనీటిని శుద్ధి చేస్తున్నారు. ఎంత సమయంలో ఎన్ని లీటర్లు సరఫరా జరుగుతోంది. ఫిల్టర్‌బెడ్ సామర్థ్యం, రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను లెక్కిస్తారు.
► స్కాడా విధానం అమలుకు స్మార్ట్‌సిటీ నుంచి రూ.46కోట్లతో అంచనాలు రూపొందించారు. మొదటగా 14ప్రాంతాల్లో 21 ఫ్లో మీటర్లు బిగించాలని నిర్ణయించగా 8ఫ్లో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ, హైలెవల్ జోన్‌లో కోర్టు, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ, రాంనగర్, అంబేద్కర్‌నగర్, లో లేవల్‌లో మార్కెట్, హౌసింగ్‌బోర్డుకాలనీ, రాంపూర్, గౌతమినగర్, భగత్‌నగర్‌లో ఫ్లో మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.
► ఫ్లో మీటర్ల బిగింపు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. సంబంధిత పనులకు స్మార్ట్‌సిటీ నుంచి రూ.25కోట్లు కేటాయించినా.. సాంకేతికంగా అనుమతులు రాకపోవడంతో ముందుకు సాగడం లేదు. సాంకేతిక అనుమతులు వస్తేనే టెండర్లు పిలిచి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
వేసవికి సిద్ధమయ్యేనా?
వేసవివరకు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటుండగా.. ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికి సాంకేతిక అనుమతులే రాలేదని, ఇందుకు అధికారులు, పాలకులు కృషి చేయడం లేదని నగర ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం 24గంటల నీటిసరఫరాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయగా.. టెండర్లు అçహ్వానించనున్నారు. సాంకేతిక పనులు కూడా వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అ ధికారులు పేర్కొంటున్నారు. నగరం మొత్తం కా కున్నా.. ప్రయోగాత్మకంగా 15వేల ఇళ్లకు అయినా 24గంటల నీటిసరఫరా చేయడానికి పనులు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా.. కా గితాలు దాటడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వేసవివరకు పూర్తిచేస్తాం
24గంటల నీటిసరఫరాలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన భగత్‌నగర్, రాంపూర్, హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ల పరిధిలో వచ్చే వేసవిలోగా నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక అనుమతులకు కొంత ఆలస్యమవుతున్నా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నాం. అతి త్వరలోనే 24 గంటల నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకుని వస్తాం.
– వల్లూరు క్రాంతి, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్
కలగానే మిగిలిపోతుందా
నగరంలో 24గంటల నీటి సరఫరా కలగానే మి గిలిపోయింది. ప్రస్తుతం ఇస్తున్న నీటి సరఫరాలో పలు ఇబ్బందులు వస్తున్నాయి. లీకేజీలు బాగా ఉంటున్నాయి. 24గంటల నీటి సరఫరా చేయాలంటే లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ లీకైనా ఎంతో నీరు వృథాగా పొతుంది. నాయకులు, అధికారులు మొదట పైప్‌లైన్ పూర్తిస్థాయిలో మార్చివేసి కొత్తలైన్లు వేసి అప్పుడు 24 నీటి సరఫరాను చేపట్టాలి.
– శ్రీలలిత, సప్తగిరికాలనీ, కరీంనగర్
ఆచరణ సాధ్యమేనా?
నగరంలో 24గంటల నీటిసరఫరా సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రోజువారి నీటి సరఫరాలో చిన్నచిన్న లీకేజీలు అరికట్టడానికి వారాల తరబడి సమయం తీసుకుంటున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాంపూర్‌లో ఉన్న పైప్‌లైన్లు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. మొదటి దశ పనులకు ఇంతవరకూ సాంకేతిక అనుమతులు రాలేదు. వీటిని దాటుకుని ఎప్పుడు పథకం ప్రారంభిస్తారు.
– మర్రి భావన, 32వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment