సమావేశంలో చర్చించుకుంటున్న హరీశ్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే
‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం.
కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్‌ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు.
ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి
‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం.
సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్‌ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎవరికీ భయపడొద్దు
‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్‌ఎస్‌కే అధిక్యం ఉంది.
ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్‌లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్‌రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment