సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని టార్గెట్‌గా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను పెద్ద సంఖ్యలో రూపొందించారు. ప్రధానంగా పాస్‌పోర్టులను రెన్యువల్ చేయించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్న నగరవాసులు మోసపోతున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు రోజుకు ఒకటి చొప్పున వస్తున్నాయని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తి నకిలీ వెబ్‌సైట్ వల్లోపడి రూ.2999 నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాస్‌పోర్టులను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న నగరవాసులు నేరుగా రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయకుండా ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే పాస్‌పోర్ట్ విభాగానికి ప్రత్యేక వెబ్‌సైట్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సర్వర్ ఆధారంగా పని చేస్తుండటంతో (www.passportindia.gov.in) అనే అడ్రస్‌తో పని చేస్తుంటుంది.
పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు (www.indianpassport.com), (www.indiapassport.ind.in), (passportindianonline.com),(onlinepassportservice.com) పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించారు. పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవే నిజమైనవిగా భావిస్తున్న నగరవాసులు వాటిలోకి ప్రవేశిస్తే... కొన్నిసార్లు ఆయా సైట్లకు వేరే వాటికి డైరెక్ట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ లోకి వెళ్తున్న బాధితులు తన పూర్తి వివరాలు పొందుపరచడంతో పాటు రుసుము చెల్లించేస్తున్నారు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కనిపించడంతో బాధితులు ఆయా సైట్స్ నకిలీవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా 40 మంది మోసపోతే ఒక్కరే ఫిర్యాదు చేస్తుంటారని అధికారులు తెలిపారు. అత్యధికులు నష్టపోయింది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా బాధితులు డబ్బు కోల్పోవడమే కాకుండా విలువైన వ్యక్తిగత డే టాను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ వెబ్‌సైట్ల మూలాలు కనుక్కోవడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం, రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెబ్‌సైట్లను పూర్తిగా సరిచూసుకున్నానే వివరాలు నింపడం, రుసుము చెల్లించడం చేయాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment