ఎర్ర సరస్వతి (ఫైల్ ఫోటో)
హస్తినాపురం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి..పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలో సోమవారం జరిగిన ఈఘటనపై పోలీసులు, మృతురాలి బంధువులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చెల్లం బాలకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో నల్గొండ జిల్లా డిండి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఎర్ర సరస్వతి (42)ని 20 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం సరస్వతికి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ మొదటి భార్యకు కుమారుడు వెంకటరమణ జన్మించగా, సరస్వతికి కూతురు అక్షిత (15) ఉంది. వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న ఇల్లు సరస్వతి పేరు మీద ఉండగా..తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని బాలకృష్ణ ఇటీవల ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు గొడవ పడ్డారని కూతురు అక్షిత పోలీసులకు తెలిపింది. సోమవారం ఉదయం కూడా మళ్లీ గొడవ పడ్డారని, తల్లిపై బాలకృష్ణ చేయి చేసుకున్నాడని అక్షిత పేర్కొంది. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తన తండ్రి టిఫిన్ తీసుకొచ్చారని, ఆ తర్వాత తాను ఆన్‌లైన్ క్లాస్‌లు వినేందుకు బెడ్‌రూంలోకి వెళ్లానని చెప్పింది. కొద్దిసేపటికి పెద్దశబ్ధం రావడంతో తాను బయటకి వచ్చి చూడగా..తన తల్లి మంటల్లో చిక్కుకుని కన్పించిందని, తనను దగ్గరకు రావొద్దని చెప్పారని తెలిపింది.
అప్పటికే తన తల్లి మొత్తం మంటల్లో కాలిపోయినట్లు అక్షిత చెప్పిందని పోలీసులు వివరించారు. మంటలు అంటుకున్న సమాచారం అందుకున్న హయత్‌నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలార్పారు. కాగా తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతురాలి భర్త బాలకృష్ణ స్వల్పగాయాలతో 108లో యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హత్యచేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు..
తన చెల్లెల్ని ఆమె భర్త బాలకృష్ణ హత్యచేసి..ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి అక్కలు సులోచన, వెంకటమ్మ, రమణలు ఆరోపించారు. ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని, కొద్దికాలంగా సరస్వతిని బాలకృష్ణ తీవ్రంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. హత్యచేసి..అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్రపన్నారని, అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనుమానాస్పద కేసు...
సోమవారం ఉదయం సజీవ దహనమైన సరస్వతి ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వనస్థలిపురం సీఐ మురళీ మోహన్ తెలిపారు. మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని, భర్త బాలకృష్ణను విచారించనున్నట్లు తెలిపారు.
చదవండి: మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
Lockdown: సారు.. లాఠీల జోరు..
Comments
Please login to add a commentAdd a comment