బొమ్మలరామారం: వరి నాటు వేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తూ బోరు బావిలో ఇరుక్కుపోయింది. నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ అయినబోయిన పద్మ స్థానిక గోలిపల్లి వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు మంగళవారం వరి నాటు వేసేందుకు వెళ్లింది.
రైతు వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద గతంలో బోరు బావిని తవ్వించగా.. నీరు పడకపోవడంతో వదిలేశాడు. ఆ భూమిలోనే కొత్తగా మడిని చేసి అందులో వరి నాటు వేయడానికి దుక్కి దున్నాడు. ఆ మడిలో మహిళా కూలీలు నాటు వేస్తుండగా పద్మ కాలు పాత బోరు బావి కేసింగ్‌లో పడింది. ఆమె నడుము వరకు అందులో కూరుకుపోయింది.
అప్రమత్తమైన తోటి కూలీలు, యజమాని ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, జేసీబీ సహాయంతో కేసింగ్‌కు సమాంతరంగా గోతిని తీసి 4గంటల పాటు శ్రమించారు. చివరికి బోరు బావి కేసింగ్ ధ్వంసం చేసి పద్మను కాపాడారు. అనంతరం పద్మను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment