Borubavi
-
బోరుబావి బాధితురాలి కాలికి శస్త్రచికిత్స !
నల్గొండ: మండలంలోని సోలీపేట్ గ్రామంలో మంగళవారం బోరుబావిలో కాలు ఇరుక్కొని 4గంటల పాటు నరకయాతన అనుభవించిన బాధితురాలు ఐనబోయిన పద్మ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్ బుధవారం తెలిపారు. జేసీబీ సహాయంతో బోరుబావి కేసింగ్ నుంచి పద్మను బయటకు తీసి మంగళవారం రాత్రి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు గంటలకు పైగా బోరు బావిలో పద్మ కాలు ఇరుక్కుపోవడంతో ఆమె కాలుకు రక్తప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టుకుపోవడంతో బుధవారం కాలుకు మూడు చోట్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తొలగించి దాతల రక్తం ఎక్కిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. బోరు బావిలో పద్మ ఇరుక్కుపోయిన స్థలాన్ని తహసీల్దార్ పద్మసుందరి ఆదేశాల మేరకు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గత రెండు రోజులుగా ముసురు వర్షం పడుతుండడంతో ఘటన జరిగిన చోటు పూర్తిగా నీటితో మునిగిపోయిందని, బోరు బావిని పూర్తిగా మట్టితో పూడ్చివేయాలని భూమి యజమానికి సూచించినట్లు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట వీఆర్ఏ మల్లేష్, గ్రామస్తులు ఉన్నారు. -
బోరు బావిలో ఇరుక్కున్న మహిళ
బొమ్మలరామారం: వరి నాటు వేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తూ బోరు బావిలో ఇరుక్కుపోయింది. నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ అయినబోయిన పద్మ స్థానిక గోలిపల్లి వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు మంగళవారం వరి నాటు వేసేందుకు వెళ్లింది. రైతు వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద గతంలో బోరు బావిని తవ్వించగా.. నీరు పడకపోవడంతో వదిలేశాడు. ఆ భూమిలోనే కొత్తగా మడిని చేసి అందులో వరి నాటు వేయడానికి దుక్కి దున్నాడు. ఆ మడిలో మహిళా కూలీలు నాటు వేస్తుండగా పద్మ కాలు పాత బోరు బావి కేసింగ్‌లో పడింది. ఆమె నడుము వరకు అందులో కూరుకుపోయింది. అప్రమత్తమైన తోటి కూలీలు, యజమాని ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, జేసీబీ సహాయంతో కేసింగ్‌కు సమాంతరంగా గోతిని తీసి 4గంటల పాటు శ్రమించారు. చివరికి బోరు బావి కేసింగ్ ధ్వంసం చేసి పద్మను కాపాడారు. అనంతరం పద్మను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
కారకులకు ఐదేళ్ల జైలు
బోరుబావిలో చిన్నారి మృతి కేసు.. పుల్కల్(ఆందోల్): రెండేళ్ల క్రితం బోరు బావిలో పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటనకు సంబంధించి మెదక్ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. భూ యజమానితోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ఎం.వాణి తీర్పు వెలువరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెంకు చెందిన కుమ్మరి రాములు తన వ్యవసాయ భూమిలో బోరు వేసేందుకు వెంకటేశ్‌కు పనులు అప్పగించాడు. 2015 నవంబర్ 27న బోరు వేసినా.. నీళ్లు పడకపోవడంతో ఆ గుంతను పూడ్చకుండానే వదిలేశారు. మరుసటి రోజు ఉదయం మూడేళ్ల బాలుడు రాకేశ్ ఆడుకుంటూ వెళ్లి ఆ బోరుబావి గుంతలో పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు 24 గంటలపాటు శ్రమించినా బాలుడిని రక్షించలేకపోయారు. దీంతో భూమి యాజమాని రాములుతోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా మెదక్ సెషన్స్ కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ‘‘ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కావొద్దు. మరణాలకు బాధ్యులైన వారికి సరైన శిక్షలు వేస్తేనే వీటిని నివారించగలుగుతాం. బోర్లు వేసి అలాగే వదిలేయడంతో చిన్నారుల మృతికి కారణమవుతున్నారు’’అని జడ్జి వాణి పేర్కొన్నారు. అమలుకు నోచుకోని హామీలు రాకేశ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే బాబూమోహన్, ఎంపీ బీబీ పాటిల్‌లు హమీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు రాకేశ్ కుటుంబానికి పైసా సాయం చేయలేదు. మూడెకరాల భూమి కూడ ఇవ్వలేదు. -
బోర్ల మరమ్మతుకు భలే పరికరం!
- బోరు నుంచి మోటార్లు, పైపులను - సునాయాసంగా వెలికి తీసే పరికరాన్ని ఆవిష్కరించిన మెకానిక్ - బోర్ల రిపేరు ఖర్చులో భారీ తగ్గుదల - బోరు లోతు ఎంత ఉన్నా.. ఇద్దరు మనుషులుంటే చాలు బోరుబావుల నుంచి కాలిపోయిన మోటార్లను.. పైపులను పైకి తీసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు ఆ యువకుడిని ఆలోచింపజేశాయి. మెకానిక్‌గా తనకున్న అనుభవానికి సృజనాత్మక ఆలోచనను జోడించి బోరు బావుల్లో నుంచి పైపులు, మోటార్‌ను సులభంగా, తక్కువ ఖర్చుతో, కొద్ది సమయంలోనే వెలికి తీసే పరికరాన్ని సావేటి వెంకటేశ్ రూపొందించాడు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలోని కమ్మం నాచారం ఆయన స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వెంకటేశ్ పరిగిలో మోటార్ వైండింగ్ షాపును నడుపుతున్నాడు. మోటారు పాడయినా లేదా బోరులో నీరు అడుగంటినా లేదా లోతు పెంచాలన్నా మోటారును, పైపులను బోరులో నుంచి పూర్తిగా పైకి తీయాల్సిందే. ఒక్కో పైపు 20 అడుగుల వరకు పొడవుంటుంది. ఈ ప్రక్రియ వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో రైతుకు కూలీల ఖర్చు భారమైంది. బోరుబావి నుంచి నీటిని తోడేందుకు వాడే హ్యాండిల్‌తో పైపులను, మోటారును ఎందుకు వెలికి తీయకూడదు? అని వెంకటేశ్ ఆలోచించాడు. ఈ ఆలోచనే చక్కని పరికరం రూపకల్పనకు దారిచూపింది. నాలుగు అడుగుల ఎత్తుగల మూడు ఇనుప పైపులను వెల్డింగ్ చేస్తే స్టాండ్ సిద్ధం చేశాడు. స్టాండ్ పైభాగంలో ఆరు అడుగుల పొడవు గల ఇనుప పైపును అమర్చాడు. బోరుకు ఉండే హ్యాండిల్ మాదిరిగా ఇది కనిపిస్తుంది. దీనికి పది అడుగుల పొడవైన ఇనుప గొలుసు, దాని చివరన కొక్కెం ఏర్పాటు చేశాడు. హ్యాండిల్‌ను ఒక వ్యక్తి పైకి, కిందకు అంటూ ఉంటే బోరు పైపు ప్రతిసారీ 2 అడుగుల మేరకు పైకి వస్తూ ఉంటుంది. ఈ పరికరం సాయంతో ఎన్ని వందల అడుగుల లోతు బోరులో నుంచైనా పైపులు, మోటార్లను సునాయాసంగా పైకి తీయవచ్చని వెంకటేశ్ (99487 07173) తెలిపాడు. 200 అడుగుల కన్నా ఎక్కువ లోతు తవ్విన బోరుబావుల్లోంచి పైపులు, మోటార్లను పైకి తీసేందుకు 10 మంది మనుషులు రోజంతా శ్రమ పడుతూ ఉంటారు. ఈ పరికరం సహాయంతో ఇద్దరు వ్యక్తులు కేవలం గంటలో పని పూర్తి చేయవచ్చని వెంకటేశ్ తెలిపాడు. మోటార్‌ను పైకి తీసి రిపేర్ చేసి తిరిగి బోరులో అమర్చేందుకు సాధారణంగా రెండు రోజుల సమయం పటే ్టది. ఈ పరికరంతో ఒక్క పూటలోనే పని పూర్తి చేయవచ్చు. దీని బరువు 40 కిలోలు ఉంటుంది. స్కూటర్‌పై సులభంగా తీసుకెళ్లవచ్చు. దీని తయారీకి రూ. 3 వేలు ఖర్చవుతుంది. ఈ పరికరంతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన స్థానిక అధికారులు 55 తాగునీటి బోర్ల నిర్వహణను వెంకటేశ్‌కు అప్పగించారు. ఈ పరికరం ఉపయోగించడం వల్ల ప్రతి బోరు మరమ్మతు ఖర్చులో రూ. 2 వేల వరకు ప్రజాధనం ఆదా అవుతోంది. హేట్సాఫ్ టు వెంకటేశ్! - కావలి మల్లేశ్, సాక్షి, పరిగి, రంగారెడ్డి జిల్లా -
మిషన్ మోడ్..!
బోరుబావిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి శాన్వి ఘటనతో జిల్లా యంత్రాంగం మేల్కొంది. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనపై కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించో...వైద్య సహాయం అందకపోతేనో లేదా ఏదైన జబ్బు సోకి మృతిచెందిన సంఘటన వంటది కాదని...కేవలం మానవ నిర్లక్ష్యం కారణంగానే శాన్వి మృతిచెందిందన్నారు. మృతి చెందిన శాన్విని తిరిగి తీసుకరాలేకపోయినా మరోసారి ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాల్టా చట్టాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ‘మిషన్మోడ్’లో చర్యలు చేపట్టేందుకు రూపొందించిన కార్యచరణ ప్రణాళిక గురించి వివరించారు. మిషన్ మోడ్ షురూ...జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ఇప్పటికే ఓ నివేదిక తెప్పించామన్నారు. కానీ అట్టి వివరాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వల్లాల ఘటన నేపథ్యంలో మళ్లీ జిల్లా వ్యాప్తంగా బోరుబావుల గురించి సమగ్ర సర్వే చేసేందుకు ‘మిషన్ మోడ్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంట్లో వీఆర్వో, వీఆర్ఏ, జనమైత్రి పోలీస్, గ్రామజ్యోతి కమిటీలు భాగస్వాములను చేస్తూ అన్ని గ్రామాలు, ఆవాసా ప్రాంతాల నుంచి బోరుబావుల లెక్కలు తెప్పిస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న , అనుమతి లేకుండా వేసిన బోరుబావులను తక్షణమే మూసివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వల్లాల ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సైతం తీవ్రంగా పరిగణించారని...ప్రభుత్వం ఆదేశాల మేరకు వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అంచనాలు తారుమారు.... శాన్వి బోరుబావిలో పడిందన్న వార్త తెలియగానే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి 8.48 నిమిషాల వరకు పాపను బోరుబావి నుంచి సురక్షితంగానే బయటకు తీసుకొస్తామని తనకు చెప్పారన్నారు. కానీ అధికారుల అంచనాలు తారుమరై పాపను కాపాడేందుకు తవ్వుతున్న ప్రదేశంలో రాక్‌షీట్ (బండరాయి) తగలడంతో పాటు, మట్టిపెల్లలు జారీ పడటంతో చేపట్టిన చర్యలు విఫలమయ్యాయన్నారు. రాత్రి 11 గంటలకు అహర్నిశలు శ్రమించినా శాన్విని కాపాపడలేకపోయామని చెప్పారు. అనుమతి ఉంటేనే... బోరుబావులు తవ్వేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైన ఘటన జరిగినప్పుడు వారిని బాధ్యుల్లి చేయకలుగుతామన్నారు. అధికారుల అనుమతి లేకుండా తవ్వుతున్న బోరుబావుల విషయంలో భూ యజమానులపై మాత్రమే కేసులు నమోదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి బోరు డ్రిల్లింగ్ అసోసియేషన్లు, వ్యక్తిగత బోరు వాహనాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అధికారుల నుంచి అనుమతి పొందిన బోరుబావులకు మాత్రమే రిగ్గు యజ మానులు బోర్లు తవ్వాలని అలాకాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏజే సీ వెంకట్రావు, డీఆర్వో రవినాయక్, జెడ్పీ సీఈ వో రావుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
గర్భశోకమే.. మిగిలింది
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావి ఘటన విషాదంతమైంది. చిన్నారి శాన్వి (2) కాపాడేందుకు సుమారు 12 గంటల పాటు రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యాధికారులు తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టినా కాపాడలేక పోయారు. తెల్లవారుజామున బయటకు తీసిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 4.30 గంటలకు శాన్వి ఇక లేదంటూ అధికారులు ధ్రవీకరించారు. ఈ ఘటన మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. బోరుబావులు వేసే విషయంలో చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల ఉదాసీనతో.. లేక రైతుల అలసత్వమో గానీ.. ఎంతో విలువైన, బంగారు భవిష్యత్ కలిగిన చిన్నారుల జీవితాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి బాధ్యులెవరైనా.. బలైపోయేది మాత్రం అభం శుభం తెలియని చిన్నారులే.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘోర సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అందుకు వల్లాల గ్రామంలో జరిగిన చిన్నారి శాన్వి ఘటనే ఉదహారణ. బతుకు దెరువు కోసం వచ్చి...బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి తల్లిదండ్రులగు వరికుప్పల స్వామి, సుస్మితల స్వగ్రామం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం. వడ్డెర కులానికి చెందిన వారు వృత్తిరీత్యా వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం స్వామి తన భార్య, కుమార్తెతో అత్తగారి గ్రామమైన వల్లాల గ్రామానికి రెండు వారాల క్రితం వలస వచ్చాడు. బావమరిది బొంత వెంకన్న వద్ద ఉంటూ ఇదే గ్రామానికి చెందిన కట్టగూరి అంజయ్య అనే రైతు భూమిలో బావిని తీసేపనులను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పనులకు వెళ్లిన వారు తమ కుమార్తె శాన్విని వెంట తీసుకెళ్లారు. 12 గంటలు బోరుబావిలోనే..అప్పటి వరకుతల్లితో పాటే ఉన్న శాన్వి నిమ్మతోటలో ప్రమాదవశాత్తు వేసిన బోరుగుంతలో పడింది. వెంటనే గమనించిన శాన్వి తల్లిదండ్రులు లబోదిబోమనడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు, అధికారులకు, గ్రామస్తులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3.35 గంటలకు బోరుబావిలో చిన్నారి పడిపోగా 4.30 గంటలకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చిన్నారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చివరకు 3.10 గంటలకు చిన్నారి శాన్విని బోరుబావిలోంచి బయటకు తీసి అర్ధగంటలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండరాళ్లతో అంతరాయం.. బోరుబావిలో చిన్నారిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా రెండు భారీ పొక్లెయిన్లతో బావిని తవ్వారు. 150 అడుగుల లోతున్న బోరుబావిలో 25 అడుగుల లోతులో చిన్నారి శాన్వి చిక్కినట్లు అధికారులు గుర్తించారు. అందుకోసం 25 అడుగుల లోతు బావిని తవ్వారు. కానీ సమాంతర బావి అడుగు భాగంలో బండరాళ్లు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వారిని అనుమతించి ఉంటే.. సంఘటన విషయం తెలుసుకుని బోరుబావిలో పడిన చిన్నారులను ప్రత్యేకంగా తయారు చేసుకున్న పనిముట్లతో సురక్షితంగా బయటకు తీసే పనిలో నైపుణ్యత కలిగిన జిల్లాలోని మార్గులపల్లి, కోదాడ, తిప్పర్తి మండలాల చెందిన పలువురు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి తరలివచ్చారు. చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారిని అందుకు అనుమతించలేదు. దీంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ వారిని అనుమతించి ఉంటే చిన్నారిని బయటకు తీసి ఉండేవారేమోనని, చిన్నారి ప్రాణాలతో బయటపడేదని పలువురు ఆవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల వైఖరిని తప్పుపట్టడంతో పాటు నిర్లక్ష్యవైఖరే శాన్వి ప్రాణాలు తీసిందంటూ దుయ్యబట్టారు. బావితవ్వకానికి 12 గంటల సమయం బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు బోరుబావికి సమాంతరంగా తీసిన 25 అడుగుల బావితవ్వకానికి 12 గంటల సమయం పట్టింది. వల్లాల గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనుల్లో ఉన్న రెండు భారీ పొక్లెయిన్లు మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పనులు చేపట్టినా సరైన సమయంలో సరైన సలహాలు అధికారుల నుంచి అందకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. బోరు ఫెయిల్ కావడంతోనే..వల్లాల గ్రామానికి చెందిన రైతు కట్టగూరి అంజయ్య తనకున్న నిమ్మతోటలో ఓ వ్యవసాయ బావి తవ్వాడు. కానీ ఆ బావిలో నీరు సరిపడా పడకపోవడంతో పక్కనే వారంరోజుల క్రితం బోరు వేశాడు. కానీ వేసిన బోరు ఫెయిలయ్యింది. దీంతో ఉన్న వ్యవసాయ బావినే మరింత లోతు తవ్వించేందుకు పనులు చేపట్టాడు. అందులో భాగంగానే వ్యవసాయ బావి తవ్వకం పనులను చిన్నారి శాన్వి తండ్రి వరికుప్పల స్వామి కుదుర్చుకున్నాడు. ఒకవేళ ఆ రైతు వేసిన బోరు పడిఉంటే వ్యవసాయ బావిని మరింత లోతుకు తవ్వేవాడు కాదు.. అతను బావిని తవ్వకుంటే స్వామి వల్లాలకు వలస వచ్చేవాడు కాదు.. స్వామి వల్లాలకు వలస రాకుంటే శాన్వి బతికి ఉండేదని పలువురు వాపోయారు. ఆ బోరు ఫెయిల్ కావడమే దీనంతటికీ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు.