నల్గొండ: మండలంలోని సోలీపేట్ గ్రామంలో మంగళవారం బోరుబావిలో కాలు ఇరుక్కొని 4గంటల పాటు నరకయాతన అనుభవించిన బాధితురాలు ఐనబోయిన పద్మ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్ బుధవారం తెలిపారు. జేసీబీ సహాయంతో బోరుబావి కేసింగ్ నుంచి పద్మను బయటకు తీసి మంగళవారం రాత్రి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు గంటలకు పైగా బోరు బావిలో పద్మ కాలు ఇరుక్కుపోవడంతో ఆమె కాలుకు రక్తప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టుకుపోవడంతో బుధవారం కాలుకు మూడు చోట్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తొలగించి దాతల రక్తం ఎక్కిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
బోరు బావిలో పద్మ ఇరుక్కుపోయిన స్థలాన్ని తహసీల్దార్ పద్మసుందరి ఆదేశాల మేరకు ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గత రెండు రోజులుగా ముసురు వర్షం పడుతుండడంతో ఘటన జరిగిన చోటు పూర్తిగా నీటితో మునిగిపోయిందని, బోరు బావిని పూర్తిగా మట్టితో పూడ్చివేయాలని భూమి యజమానికి సూచించినట్లు ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట వీఆర్‌ఏ మల్లేష్, గ్రామస్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment