నల్గొండ: స్వాతంత్రోద్యమంతో పాటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి గొప్ప నాయకులను అందించిన పోరుగడ్డ తుంగతుర్తి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నియోజకవర్గం ఎంతో కీలకమైనది. ఉద్దండులు ప్రాతి నిధ్యం వహించిన నియోజకవర్గంగా పేరొందిన ఈ స్థానానికి జరిగిన ప్రతి పోరూ ఉత్కంఠ రేకెత్తించింది. కొన్నేళ్లు కమ్యూనిస్టుల అడ్డాగా.. ఆపై కాంగ్రెస్ కంచుకోటగా ఈ ప్రాంతం పేరు పొందింది.
మూడు జిల్లాల పరిధిలో..!
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయడంతో తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, నూతనకల్ మండలాలు సూర్యాపేట జిల్లాలోకి వెళ్లాయి. మోత్కూరు, అడ్డగుడూరు యాదాద్రి జిల్లాలోకి వెళ్లాయి. శాలిగౌరారం మండలం నల్లగొండ జిల్లాలోకి వెళ్లింది.
పోరు హోరాహోరీ..!
తుంగతుర్తి ప్రాంతం 1952 ఎన్నికల వరకు సూర్యాపేట ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. తదనంతరం 1957, 1962లో నాగారం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1967 నుంచి తుంగతుర్తి నియోజకవర్గంగా ఏర్పడగా ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. 1962, 1985, 1989, 2004లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1957లో సీపీఐ, 1967, 1978, 1983లో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. 1999, 2009లో టీడీపీ విజయం సాధించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక నేతగా ఉన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి 1957, 1967లో, సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978, 1983లో సీపీఎం తరఫున గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో గెలుపొందారు.
3 ఓట్లతో ఓడిన బీఎన్‌రెడ్డి
1957లో నాగారం నియోజకవర్గ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి 1962లో అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరెడ్డి రంగారెడ్డి చేతిలో 3 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మొదటగా 100 ఓట్ల తేడా ఉండగా.. రీకౌంటింగ్‌లో 3 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
స్వతంత్రులకు సైతం పట్టం
నియోజకవర్గంలో స్వతంత్రులు, స్థానికేతరులు కూడా విజయం సాధించారు. 1972లో ఓరుగంటి వెంకటనర్సయ్యకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ జెన్నారెడ్డి సుధీర్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. దామోదర్‌రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సీపీఎం అభ్యర్థి వర్ధెల్లి బుచ్చిరాములుపై 1008 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అదేవిధంగా స్థానికేతరులైన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, గాదరి కిశోర్ తుంగతుర్తి నుంచి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment