insidents
-
ఒక్కసారిగా.. బుల్లెట్ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ రావల్ బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వచ్చాడు. సాయి భగవాన్ ఎన్క్లేవ్ వద్ద నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి కుమారులు హేమంత్ రావల్(03), భాస్కర్ ఉన్నారు. హేమంత్ 8వ తేదీన ఇంటి పక్కన ఉండే పురుషోత్తం బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి తండ్రి లక్ష్మణ్ రావల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలుడి ప్రాణం తీసిన నీటిగుంత..!
మహబూబ్‌నగర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలోని నీటిగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా పెద్దగూడెంతండా పైగడ్డ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన ఆలకుంట గోపాలకృష్ణ, వనితలకు యశ్వంత్, ప్రణీత్‌కుమార్(7) ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాలతో వనిత రెండేళ్ల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం గోపాల్ మరో పెళ్లి చేసుకుని ఇద్దరు కుమారులతో కలిసి..హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో రెండు రోజుల క్రితం అందరూ కలిసి వనపర్తి మండలం పెద్దగూడెంతండా పైగడ్డకు వచ్చారు. ఆదివారం పెళ్లి వేడుకల్లో అందరూ సరదాగా గడిపారు. మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వెళదామనుకున్నా.. భారీ వర్షాల వల్ల ఆగిపోయారు. ప్రణీత్‌కుమార్‌తో పాటు బంధువుల అబ్బాయి వినీత్, ఒక బాలుడు కలిసి మంగళవారం ఉదయం ఇంటికి కొంత దూరంలో ఉన్న వ్యవసాయ పొలంలోని నీటి గుంత వద్దకు బహిర్భూమికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రణీత్ అందులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు మిగిలిన ఇద్దరు ప్రయత్నించినా అప్పటికే నీటిలో మునిగిపోయాడు. వెంటనే ఇంటికి వచ్చిన వినీత్ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. వారు నీటి గుంత వద్దకు చేరుకొని ప్రణీత్‌ను బయటికి తీసి వనపర్తిలోని ఓ ఆస్పత్రికి తీసుకురాగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రూరల్ ఎస్ఐ నాగన్న తెలిపారు. సాయంత్రం సంకిరెడ్డిపల్లిలో ప్రణీత్ అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆ 'డీఈ' మరోసారి నోరుపారేసుకున్నాడు.. చివరికి..
కరీంనగర్: ఆ డీఈ మరోసారి నోరుపారేసుకున్నాడు. వరుస వివాదాలు చుట్టుముట్టినా తనను ఎవరూ ఏమి చేయరనే ధీమా మళ్లీమళ్లీ మాటలు తూలేలా చేస్తోంది. తన పైఅధికారులనే లెక్కచేయని సదరు డీఈ ఈ సారి మున్సిపల్ ప్రైవేట్ డ్రైవర్లపై బూతులందుకున్నారు. డీఈ బూతులను తట్టుకోలేని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు , అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పార్కింగ్ టైల్స్ పనులు కొనసాగుతున్నందున, అద్దెకార్లను కళాభారతి వైపు పార్క్ చేస్తున్నారు. కళాభారతి వైపున్న గేట్‌ను మూసివేయడంతో కార్ల పార్కింగ్‌కు ఇబ్బంది కూడా లేదు. మంగళవారం సాయంత్రం సదరు డీఈ మూసి ఉన్న గేట్‌ను తీయించుకుని లోనికివచ్చాడు. రావడంతోనే ‘ఎవడ్రా నా కొడుకుల్లారా..కార్లిక్కడ పెట్టింది’ అంటూ బూతులతో దూషణకు దిగాడు. డీఈ వైఖరిపై తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్లు బుధవారం కార్యాలయంలో నిరసన తెలిపారు. సదరు డీఈపై చర్యతీసుకోవాలని మేయర్ సునీల్‌రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా డీఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బూతుల డీఈని ఉన్నతాధికారులు నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రైవేట్ డ్రైవర్లు గిరిభవన్కుమార్, ప్రశాంత్, సంపత్, శేఖర్ ఉన్నారు. -
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు ఒక్కసారిగా..
మంచిర్యాల: న్యూఢిల్లీ నుంచి చెన్నయ్ వెళ్తున్న తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వ్యాపించడం కలకలం రేపింది. ఈ ఘట న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఎస్–3 బోగీ వద్ద క్రమంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు. వెంటనే రైల్వే అధికారులు రైలును స్టేషన్లో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. రైల్వే టెక్నికల్ టీమ్ నిశితంగా తనిఖీ చేసి ప్రమాదమేమీ లేదని, కేవలం రైలు బ్రేక్‌లు చక్రాలకు గట్టిగా పట్టుకోవడంతో పొగలు వ్యాపించినట్లుగా గు ర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బ్రేక్‌లను సరి చేసి గంట తర్వాత రైలుకు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగా.. అప్పటివరకు ఏర్పడిన ఆందోళనకు తెరపడింది. -
బోరుబావి బాధితురాలి కాలికి శస్త్రచికిత్స !
నల్గొండ: మండలంలోని సోలీపేట్ గ్రామంలో మంగళవారం బోరుబావిలో కాలు ఇరుక్కొని 4గంటల పాటు నరకయాతన అనుభవించిన బాధితురాలు ఐనబోయిన పద్మ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్ బుధవారం తెలిపారు. జేసీబీ సహాయంతో బోరుబావి కేసింగ్ నుంచి పద్మను బయటకు తీసి మంగళవారం రాత్రి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు గంటలకు పైగా బోరు బావిలో పద్మ కాలు ఇరుక్కుపోవడంతో ఆమె కాలుకు రక్తప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టుకుపోవడంతో బుధవారం కాలుకు మూడు చోట్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తొలగించి దాతల రక్తం ఎక్కిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. బోరు బావిలో పద్మ ఇరుక్కుపోయిన స్థలాన్ని తహసీల్దార్ పద్మసుందరి ఆదేశాల మేరకు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గత రెండు రోజులుగా ముసురు వర్షం పడుతుండడంతో ఘటన జరిగిన చోటు పూర్తిగా నీటితో మునిగిపోయిందని, బోరు బావిని పూర్తిగా మట్టితో పూడ్చివేయాలని భూమి యజమానికి సూచించినట్లు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట వీఆర్ఏ మల్లేష్, గ్రామస్తులు ఉన్నారు. -
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్‌గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
అబ్బే.. అలా జరక్కూడదే..?!
గతమంతా చరిత్రే. ఘనమైనా కాకపోయినా కూడా హిస్టరీ హిస్టరీనే. దాన్నెవరూ మార్చలేరు. వింత, విశేషం, విషాదం.. జరిగిందేదైనా విని తరించాల్సిందే. వీటిలో కొన్ని 'అబ్బో..'అనిపిస్తాయి. మరికొన్ని 'అబ్బా..!' అనేలా ఉసూరుమనిపిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడో కోవకు చెందిన కథలుంటాయి. ఇవి మాత్రమే, 'అబ్బే.. అలా జరక్కూడదే..?!' అనిపిస్తాయి. చదివేవారి ముఖంలో ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు పుట్టిస్తాయి. అలాంటి యదార్థ సంఘటనలే ఇవి..! కవల సోదరుల వింత కథ! 1970, అమెరికాలోని ఒహాయో రాష్ట్రం. అక్కడి లిమా నగరంలో నివసించే జేమ్స్‌కు తన చిన్ననాటి విషయాలు తెలుసుకోవాలనిపించింది. తల్లిదండ్రులను అడిగితే, అతడికో కవల సోదరుడు ఉండేవాడని చెప్పారు. 'చిన్నతనంలోనే నిన్ను దత్తత తీసుకున్నాం. నువ్వూ నీ సోదరుడూ కవలలు. నిన్ను మేం పెంచుకున్నట్టే, నీ సోదరుడిని కూడా వేరే కుటుంబం దత్తత తీసుకుంది' అని వివరించారు. దీంతో ఎలాగైనా ఆ 'హలో! బ్రదర్' ని కలుసుకోవాలన్న తపన జేమ్స్లో ఎక్కువైంది. ఆ ప్రయత్నంలో భాగంగా తన సోదరుడు 40 మైళ్ల దూరంలోని పిక్వా పట్టణంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. చివరకు 39 ఏళ్ల వయసులో ఇద్దరూ కలుసుకున్నారు కూడా. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్టు! ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితిలో కన్నీంటి పర్యంతమయ్యారు. తర్వాత కాస్త శాంతించి, ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఇరువురూ తెలుసుకున్న కొన్ని నిజాలు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాల్లోకి నెట్టాయి. 39 ఏళ్ల క్రితం రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాక, వీరిద్దరూ వేర్వేరు నగరాల్లో పెరిగారు. కాకతాళీయంగా వీరిద్దరికీ పెంపుడు తల్లిదండ్రులు జేమ్స్ అనే పేర్లు పెట్టారు. వీరిద్దరూ చిన్నతనంలో లెక్కలు బాగా చేసేవారు, స్పెల్లింగులను ఇష్టపడేవారు కాదు. ఇరువురిదీ వడ్రంగి పని, చిత్రలేఖనంలో అందెవేసిన చేయి. 'లిండా' అనే పేరున్న అమ్మాయిలనే ఈ కవల సోదరులు పెళ్లి చేసుకున్నారు. అయితే, చిత్రంగా ఇద్దరి వైవాహిక జీవితాలూ విఫలమయ్యాయి. తర్వాత 'బెట్టీ' నామధేయులైన మహిళలనే వీరు పెళ్లాడారు. ఈ కవల సోదరులకి ఒక్కో కుమారుడే సంతానం. యాదృచ్ఛికంగా వీరి పేర్లు 'జేమ్స్ అలాన్' ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఈ విచిత్ర సోదరులకి ఓ పెంపుడు కుక్క ఉండేది. దాని పేరేంటో తెలుసా..? 'టాయ్' వీరి కథంతా విని, 'ఉంటే ఉండొచ్చు గానీ, మరీ ఇన్ని సారూప్యతలా' అని అప్పట్లో ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది!! చిత్రంలో విచిత్రం..! జర్మనీ లో జరిగిన ఈ యాదృచ్ఛిక సంఘటన చాలా ఏళ్లపాటు ఫొటోగ్రాఫర్ల మదిలో మెదులుతూనే ఉంది. 1914లో ఓ జర్మన్ మహిళ స్ట్రాస్‌బర్గ్ పట్టణంలోని ఫొటో స్టూడియోకు వెళ్లింది. తన కుమారుడిని ఫొటో తీయాలంటూ అక్కడి సిబ్బందిని కోరింది. దానికి అవసరమైన 'ఫిల్మ్ ప్లేట్'ను కూడా ఆమె కొనుగోలు చేసింది. దీంతో ఆ పాలబుగ్గల పసివాడిని తన కెమెరాలో క్లిక్‌మనిపించాడు అక్కడి ఫొటోగ్రాఫర్. ఇప్పటిలాగా ఫొటో తీసిన వెంటనే డెవలప్ చేసి ఇచ్చేసే సౌకర్యం ఆ రోజుల్లో లేకపోవడంతో కొద్ది రోజుల తర్వాత వచ్చి చిత్రాలు పట్టుకెళ్లమని చెప్పారు స్టూడియో సిబ్బంది. దీంతో ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోయింది. అయితే, దురదృష్టవశాత్తూ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. దీంతో మళ్లీ స్టూడియోకు వెళ్లడం ఆమెకు కుదర్లేదు. యుద్ధ ప్రభావం కారణంగా స్టూడియో నడుస్తోందో, మూత పడిందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఇంకేముంది, తన 'ఫిల్మ్ ప్లేట్'పై ఆశలు వదులుకుంది. మళ్లీ ఎన్నడూ ఆ చిత్రాల గురించి ఆమె ఆలోచించలేదు. నెమ్మదిగా రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో ఆమె స్ట్రాస్బర్గ్ను విడిచిపెట్టి, ఫ్రాంక్ఫర్ట్ నగరానికి మకాం మార్చింది. మరో చిన్నారికి తల్లి కూడా అయ్యింది. ఓ కుమారుడు, కుమార్తెతో సంతోషంగా కాలం గడుపుతోంది. అయితే, తన దగ్గర వారికి చెందిన ఒక్క ఫొటో కూడా లేకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. వెంటనే స్థానిక స్టూడియోకు వెళ్లింది. ఈసారి మరో 'ఫిల్మ్ ప్లేట్'ను కొనుగోలు చేసి, తన కుమార్తెను ఫొటో తీయాలంటూ కోరింది. గతంలో జరిగినట్టుగా ఈ ప్రయత్నం విఫలం కాలేదు. అయితే, అత్యంత సంచలనంగా మారింది. దీనికి కారణం డెవలప్ చేసిన ఫొటోల్లో ఆమెకు తన కుమార్తెతో పాటు వెనకభాగంలో కుమారుడు కూడా కనిపిస్తుండటమే. రెండేళ్ల క్రితం 100 మైళ్ల దూరంలోని స్ట్రాస్‌బర్గ్ స్టూడియోలో తప్ప వేరే ఎక్కడా తన కుమారుడిని ఫొటోషూట్ చేయించలేదని ఆమె చెప్పింది. దీంతో స్టూడియో నిర్వాహకులకు సైతం కళ్లు తిరిగాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..? అప్పుడెప్పుడో బాలుడిని చిత్రించిన 'ఫిల్మ్ ప్లేట్'ను స్టూడియో వాళ్లు డెవలప్ చేయలేదు. అదే ఫిల్మ్ ప్లేట్ ఎన్నో చేతులు మారి, చివరకు ఫ్రాంక్ఫర్ట్ నగరానికి చేరింది. అక్కడ కూడా మళ్లీ పాత యజమానురాలైన జర్మన్ మహిళ చేతికే చిక్కింది. అయితే, ఇది గ్రహించని ఫొటోగ్రాఫర్.. దానిపైనే రెండో చిత్రం తీయడంతో ఇదంతా జరిగింది. ఒకే చిత్రంలో తన కుమార్తెతో పాటు, కాల గర్భంలో కలిసిపోయిందనుకున్న కుమారుడి చిత్రం కూడా కలిసిరావడంతో ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బైంది. విధి అంటే ఇదే కాబోలు!! -
నోరెళ్లబెట్టించే సంఘటనలు..
ఎన్నో వింతలకు నిలయం ఈ ప్రపంచం. ఎన్నో కథలు.. నమ్మాల్సినవి, నమ్మరానివీ! అయితే, అతికొద్ది కథలు మాత్రమే నమ్మశక్యం కానివిగా ఉంటూ నమ్మితీరాల్సిందే అనిపిస్తాయి. యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో కానీ చరిత్రలోని కొన్ని సంఘటనలు నోరెళ్లబెట్టిస్తాయి. వాటిలో కొన్నిటిని మనమూ తెలుసుకుందాం.. ఆశ్చర్యపోదాం! ఊ.. కొడతారా? కొట్టి పారేస్తారా?? రాజు.. రెస్టారెంట్ ఓనర్! పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన సంఘటన ఇది. ఇటలీ రాజైన ఒకటో ఉంబెర్టో విహారానికి వెళ్లాడు. అందులో భాగంగా జనరల్ ఎమ్మిలో పొంజియా వాగ్లియాతో కలిసి మోంజా నగరానికి చేరుకున్నాడు. స్థానిక రెస్టారెంట్లోకి ప్రవేశించిన రాజుకి సాదర స్వాగతం పలికాడు దాని యజమాని. మహారాజుకి ఏమేం ఇష్టమో తెలుసుకుని వాటిని తయారుచేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాడు. మరోవైపు, రెస్టారెంట్ యజమానిని చూసినప్పటినుంచీ రాజు మదిలో ఏదో మెదులుతోంది. దీనికి కారణం అతడు అచ్చు గుద్దినట్టు రాజు ఉంబెర్టోలా ఉండటమే! తొలుత సంశయించిన రాజు.. కొద్దిసేపటికి తన మనసులోని మాటను బయటపెట్టాడు. 'మీరు కాస్త అటుఇటుగా నాలాగే కనిపిస్తున్నారే!' అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా ముచ్చట ప్రారంభమైంది. ఇందులో రాజుకి దిమ్మదిరిగిపోయే నిజాలు తెలిశాయి. 1844 మార్చి 14నే ఇద్దరూ జన్మించారు. అది కూడా ఒకే నగరంలో! మార్గరీటా అనే పేరున్న మహిళలనే వీరు వివాహమాడారు. ఆసక్తికరంగా.. రాజు పట్టాభిషిక్తుడైన రోజు, యజమాని రెస్టారెంట్ తెరచిన రోజు కూడా ఒక్కటే! ఈ సంఘటన తర్వాత రాజు తరచూ ఆయన గురించి వాకబు చేస్తూ ఉండేవారు. అలా, 1990 జూలై 29 సాయంత్రం రాజుకి ఎవరో వచ్చి రెస్టారెంట్ యజమాని కొద్దిసేపటి క్రితమే మరణించాడని చెప్పారు. ఇది విన్న రాజు ఎంతగానో బాధ పడ్డాడు. అయితే, విచార కరంగా అదే రోజున ఆయన కూడా హత్యకు గురయ్యాడు. గేటానో బ్రెస్కి అనే వ్యక్తి ఉంబెర్టోను నాలుగు రౌండ్లు కాల్చి చంపాడు. ఇలా ఒకే రోజు మొదలైన వీరిద్దరి జీవితాలు.. అనేక సారూప్యతలతో ఒకే రోజున ముగిశాయి. హోటల్ రహస్యం..! 1953 నాటి సంఘటన.. ఓ వార్తాపత్రికలో రిపోర్టర్‌గా పనిచేసే ‘ఇర్వ్ కుప్సినెట్’ బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ పట్టాభిషేకాన్ని కవర్ చేసేందుకు లండన్ చేరుకున్నాడు. నగరంలోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న సావోయ్ హోటల్లో బసచేసేందుకు నిర్ణయించుకున్నాడు. అత్యంత విలాసవంతమైన ఆ హోటల్లో ఓ గదిని ఆయనకు కేటాయించారు సిబ్బంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఇర్వ్.. ఊసుపోక తన మంచం పక్కనే ఉన్న టేబుల్ సొరుగులను తెరిచాడు. అందులో కొన్ని వస్తువులున్నాయి. వాటిని పరిశీలించి చూశాడు. ‘హ్యారీ హానిన్’ అనే పేరు రాసి ఉంది వాటిపై! దీంతో ఇర్వ్‌కు ఆ వస్తువులు ఆసక్తికరంగా తోచాయి. ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ క్లబ్ హార్లెమ్ గ్లోబ్ట్రాటర్స్ క్రీడాకారుడు హ్యారీ హానిన్ పేరు అది. ఇతడు ఇర్వ్‌కు మంచి స్నేహితుడు కూడా! రెండు రోజులు గడిచాయి. ఈ సంఘటన అతని మెదడును తొలిచేస్తోంది. వెంటనే హ్యారీకి కాల్ చేశాడు. ‘హాయ్ హ్యారీ! నువ్వెప్పుడైనా సావోయ్ హోటల్లో బస చేశావా?’ అని అడిగాడు. దీనికి అవుననే సమాధానం వచ్చింది అటువైపు నుంచి. ఇక, ఇర్వ్ విషయం చెబుదామనుకునే లోపు హ్యారీ నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘ఇర్వ్.. నువ్వెప్పుడైనా ప్యారిస్‌లోని లీ మ్యూరైస్ హోటల్లో బస చేశావా?’’ అన్నదే ఆ ప్రశ్న. అంతటితో ఆగక.. అక్కడి గదిలో ఇర్వ్ కుప్సినెట్ పేరుతో కొన్ని వస్తువులను తాను చూశానని, అందుకే అలా అడగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు హ్యారీ. దీంతో ఇర్వ్‌కు దిమ్మదిరిగింది! ‘మిస్టరీస్ ఆఫ్ అనెక్స్ప్లెయిన్డ్’ పుస్తకంలో ఈ యదార్థ గాథ ప్రచురితమైంది. ప్యారిస్‌లో దొరికింది! ఈ యాదృచ్ఛిక సంఘటన 1920లో జరిగింది. అమెరికా రచయిత్రి అన్నే పార్రిష్ తన భర్తతో కలిసి విహారయాత్రకు ప్యారిస్ వెళ్లారు. అక్కడి పుస్తక విక్రయ కేంద్రాలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే ఇద్దరూ వాటిలోకి చొరబడ్డారు. పుస్తకాల పురుగులైన ఈ భార్యాభర్తలు మంచి పుస్తకం కోసం వెదుకులాటలో భాగంగా చివరికి ఓ షాపులో ఆగారు. అందులో అన్నేకు ఓ పుస్తకం దొరికింది. 'జాక్ ఫ్రాస్ట్ అండ్ అదర్ స్టోరీస్' అనే ఆ పుస్తకాన్ని చూడగానే ఆమెకు ఎక్కడలేని సంతోషం కలిగింది. అన్నేకు అత్యంత ఇష్టమైన కథల పుస్తకం అది. అంతేకాదు.., జాక్ ఫ్రాస్ట్ కాపీని చిన్నతనంలో ఆమెకు తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకంతో తనకు ఎంతో అనుబంధం ఉంది. వాటన్నిటీ గుర్తుకు తెచ్చుకున్న అన్నే.. ఆనంద బాష్పాలు రాలుస్తూ భర్తకు విషయమంతా చెప్పింది. జాక్ ఫ్రాస్ట్లో అంత సీనుందా అన్నట్టు ఫేసు పెట్టిన ఆయన పుస్తకాన్ని తెరిచాడు. అంతే.. మరో ఆశ్చర్యం. లోపలి పేజీల్లో 'అన్నే పార్రిష్, 209 ఎన్ వెబర్ స్ట్రీట్, కొలరాడో స్ప్రింగ్స్' అని రాసి ఉంది. అది కూడా అన్నే చేతిరాతతోనే! పదుల ఏళ్ల క్రితం అమెరికాలో పోగొట్టుకున్న పుస్తకం ప్యారిస్‌లో తేలి, మళ్లీ తన చేతికే చిక్కడాన్ని ఈ అమెరికన్ రచయిత్రి చాలా కాలం పాటు నమ్మలేకపోయింది!!