మహబూబ్‌నగర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలోని నీటిగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా పెద్దగూడెంతండా పైగడ్డ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన ఆలకుంట గోపాలకృష్ణ, వనితలకు యశ్వంత్, ప్రణీత్‌కుమార్(7) ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాలతో వనిత రెండేళ్ల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఏడాది క్రితం గోపాల్ మరో పెళ్లి చేసుకుని ఇద్దరు కుమారులతో కలిసి..హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో రెండు రోజుల క్రితం అందరూ కలిసి వనపర్తి మండలం పెద్దగూడెంతండా పైగడ్డకు వచ్చారు. ఆదివారం పెళ్లి వేడుకల్లో అందరూ సరదాగా గడిపారు. మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వెళదామనుకున్నా.. భారీ వర్షాల వల్ల ఆగిపోయారు.
ప్రణీత్‌కుమార్‌తో పాటు బంధువుల అబ్బాయి వినీత్, ఒక బాలుడు కలిసి మంగళవారం ఉదయం ఇంటికి కొంత దూరంలో ఉన్న వ్యవసాయ పొలంలోని నీటి గుంత వద్దకు బహిర్భూమికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రణీత్ అందులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు మిగిలిన ఇద్దరు ప్రయత్నించినా అప్పటికే నీటిలో మునిగిపోయాడు. వెంటనే ఇంటికి వచ్చిన వినీత్ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు.
వారు నీటి గుంత వద్దకు చేరుకొని ప్రణీత్‌ను బయటికి తీసి వనపర్తిలోని ఓ ఆస్పత్రికి తీసుకురాగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రూరల్ ఎస్‌ఐ నాగన్న తెలిపారు. సాయంత్రం సంకిరెడ్డిపల్లిలో ప్రణీత్ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment