అబ్బే.. అలా జరక్కూడదే..?! | unbelievable real Insidents in history | Sakshi
Sakshi News home page

అబ్బే.. అలా జరక్కూడదే..?!

Published Thu, Oct 15 2015 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

unbelievable real Insidents in history

గతమంతా చరిత్రే. ఘనమైనా కాకపోయినా కూడా
 హిస్టరీ హిస్టరీనే. దాన్నెవరూ మార్చలేరు.
 వింత, విశేషం, విషాదం.. జరిగిందేదైనా విని
 తరించాల్సిందే. వీటిలో కొన్ని 'అబ్బో..'అనిపిస్తాయి.
 మరికొన్ని 'అబ్బా..!' అనేలా ఉసూరుమనిపిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడో కోవకు చెందిన
 కథలుంటాయి. ఇవి మాత్రమే,
 'అబ్బే.. అలా జరక్కూడదే..?!' అనిపిస్తాయి.
 చదివేవారి ముఖంలో ప్రశ్నార్థకాలు,
 ఆశ్చర్యార్థకాలు పుట్టిస్తాయి.
 అలాంటి యదార్థ సంఘటనలే ఇవి..!

కవల సోదరుల వింత కథ!
1970, అమెరికాలోని ఒహాయో రాష్ట్రం. అక్కడి లిమా నగరంలో నివసించే జేమ్స్‌కు తన చిన్ననాటి విషయాలు తెలుసుకోవాలనిపించింది. తల్లిదండ్రులను అడిగితే, అతడికో కవల సోదరుడు ఉండేవాడని చెప్పారు. 'చిన్నతనంలోనే నిన్ను దత్తత తీసుకున్నాం. నువ్వూ నీ సోదరుడూ కవలలు. నిన్ను మేం పెంచుకున్నట్టే, నీ సోదరుడిని కూడా వేరే కుటుంబం దత్తత తీసుకుంది' అని వివరించారు. దీంతో ఎలాగైనా ఆ 'హలో! బ్రదర్' ని కలుసుకోవాలన్న తపన జేమ్స్‌లో ఎక్కువైంది. ఆ ప్రయత్నంలో భాగంగా తన సోదరుడు 40 మైళ్ల దూరంలోని పిక్వా పట్టణంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. చివరకు 39 ఏళ్ల వయసులో ఇద్దరూ కలుసుకున్నారు కూడా. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్టు!

ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితిలో కన్నీంటి పర్యంతమయ్యారు. తర్వాత కాస్త శాంతించి, ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఇరువురూ తెలుసుకున్న కొన్ని నిజాలు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాల్లోకి నెట్టాయి.

39 ఏళ్ల క్రితం రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాక, వీరిద్దరూ వేర్వేరు నగరాల్లో పెరిగారు. కాకతాళీయంగా వీరిద్దరికీ పెంపుడు తల్లిదండ్రులు జేమ్స్ అనే పేర్లు పెట్టారు. వీరిద్దరూ చిన్నతనంలో లెక్కలు బాగా చేసేవారు, స్పెల్లింగులను ఇష్టపడేవారు కాదు. ఇరువురిదీ వడ్రంగి పని, చిత్రలేఖనంలో అందెవేసిన చేయి. 'లిండా' అనే పేరున్న అమ్మాయిలనే ఈ కవల సోదరులు పెళ్లి చేసుకున్నారు. అయితే, చిత్రంగా ఇద్దరి వైవాహిక జీవితాలూ విఫలమయ్యాయి. తర్వాత 'బెట్టీ' నామధేయులైన మహిళలనే వీరు పెళ్లాడారు. ఈ కవల సోదరులకి ఒక్కో కుమారుడే సంతానం. యాదృచ్ఛికంగా వీరి పేర్లు 'జేమ్స్ అలాన్' ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఈ విచిత్ర సోదరులకి ఓ పెంపుడు కుక్క ఉండేది. దాని పేరేంటో తెలుసా..? 'టాయ్' వీరి కథంతా విని, 'ఉంటే ఉండొచ్చు గానీ, మరీ ఇన్ని సారూప్యతలా' అని అప్పట్లో ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది!!
 
 చిత్రంలో విచిత్రం..!
 
జర్మనీ లో జరిగిన ఈ యాదృచ్ఛిక సంఘటన చాలా ఏళ్లపాటు ఫొటోగ్రాఫర్ల మదిలో మెదులుతూనే ఉంది. 1914లో ఓ జర్మన్ మహిళ స్ట్రాస్‌బర్గ్ పట్టణంలోని ఫొటో స్టూడియోకు వెళ్లింది. తన కుమారుడిని ఫొటో తీయాలంటూ అక్కడి సిబ్బందిని కోరింది. దానికి అవసరమైన 'ఫిల్మ్ ప్లేట్'ను కూడా ఆమె కొనుగోలు చేసింది. దీంతో ఆ పాలబుగ్గల పసివాడిని తన కెమెరాలో క్లిక్‌మనిపించాడు అక్కడి ఫొటోగ్రాఫర్. ఇప్పటిలాగా ఫొటో తీసిన వెంటనే డెవలప్ చేసి ఇచ్చేసే సౌకర్యం ఆ రోజుల్లో లేకపోవడంతో కొద్ది రోజుల తర్వాత వచ్చి చిత్రాలు పట్టుకెళ్లమని చెప్పారు స్టూడియో సిబ్బంది. దీంతో ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోయింది. అయితే, దురదృష్టవశాత్తూ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. దీంతో మళ్లీ స్టూడియోకు వెళ్లడం ఆమెకు కుదర్లేదు. యుద్ధ ప్రభావం కారణంగా స్టూడియో నడుస్తోందో, మూత పడిందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఇంకేముంది, తన 'ఫిల్మ్ ప్లేట్'పై ఆశలు వదులుకుంది. మళ్లీ ఎన్నడూ ఆ చిత్రాల గురించి ఆమె ఆలోచించలేదు.

నెమ్మదిగా రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో ఆమె స్ట్రాస్‌బర్గ్‌ను విడిచిపెట్టి, ఫ్రాంక్‌ఫర్ట్ నగరానికి మకాం మార్చింది. మరో చిన్నారికి తల్లి కూడా అయ్యింది. ఓ కుమారుడు, కుమార్తెతో సంతోషంగా కాలం గడుపుతోంది. అయితే, తన దగ్గర వారికి చెందిన ఒక్క ఫొటో కూడా లేకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. వెంటనే స్థానిక స్టూడియోకు వెళ్లింది. ఈసారి మరో 'ఫిల్మ్ ప్లేట్'ను కొనుగోలు చేసి, తన కుమార్తెను ఫొటో తీయాలంటూ కోరింది. గతంలో జరిగినట్టుగా ఈ ప్రయత్నం విఫలం కాలేదు. అయితే, అత్యంత సంచలనంగా మారింది. దీనికి కారణం డెవలప్ చేసిన ఫొటోల్లో ఆమెకు తన కుమార్తెతో పాటు వెనకభాగంలో కుమారుడు కూడా కనిపిస్తుండటమే. రెండేళ్ల క్రితం 100 మైళ్ల దూరంలోని స్ట్రాస్‌బర్గ్ స్టూడియోలో తప్ప వేరే ఎక్కడా తన కుమారుడిని ఫొటోషూట్ చేయించలేదని ఆమె చెప్పింది. దీంతో స్టూడియో నిర్వాహకులకు సైతం కళ్లు తిరిగాయి.

ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..? అప్పుడెప్పుడో బాలుడిని చిత్రించిన 'ఫిల్మ్ ప్లేట్'ను స్టూడియో వాళ్లు డెవలప్ చేయలేదు. అదే ఫిల్మ్ ప్లేట్ ఎన్నో చేతులు మారి, చివరకు ఫ్రాంక్‌ఫర్ట్ నగరానికి చేరింది. అక్కడ కూడా మళ్లీ పాత యజమానురాలైన జర్మన్ మహిళ చేతికే చిక్కింది. అయితే, ఇది గ్రహించని ఫొటోగ్రాఫర్.. దానిపైనే రెండో చిత్రం తీయడంతో ఇదంతా జరిగింది. ఒకే చిత్రంలో తన కుమార్తెతో పాటు, కాల గర్భంలో కలిసిపోయిందనుకున్న కుమారుడి చిత్రం కూడా కలిసిరావడంతో ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బైంది. విధి అంటే ఇదే కాబోలు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement