గర్భశోకమే.. మిగిలింది | Garbhasokame .. Remaining | Sakshi
Sakshi News home page

గర్భశోకమే.. మిగిలింది

Published Wed, Feb 3 2016 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

గర్భశోకమే.. మిగిలింది

గర్భశోకమే.. మిగిలింది


 శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావి ఘటన విషాదంతమైంది. చిన్నారి శాన్వి (2) కాపాడేందుకు సుమారు 12 గంటల పాటు రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యాధికారులు తమ సిబ్బందితో  సహాయక చర్యలు చేపట్టినా కాపాడలేక పోయారు.  తెల్లవారుజామున బయటకు తీసిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 4.30 గంటలకు శాన్వి ఇక లేదంటూ అధికారులు ధ్రవీకరించారు. ఈ ఘటన మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది.


బోరుబావులు వేసే విషయంలో చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల ఉదాసీనతో.. లేక రైతుల అలసత్వమో గానీ.. ఎంతో విలువైన, బంగారు భవిష్యత్ కలిగిన చిన్నారుల జీవితాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి బాధ్యులెవరైనా.. బలైపోయేది మాత్రం అభం శుభం తెలియని చిన్నారులే.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘోర సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అందుకు వల్లాల గ్రామంలో జరిగిన చిన్నారి శాన్వి ఘటనే ఉదహారణ.
 బతుకు దెరువు కోసం వచ్చి...బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి తల్లిదండ్రులగు వరికుప్పల స్వామి, సుస్మితల స్వగ్రామం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం. వడ్డెర కులానికి చెందిన వారు వృత్తిరీత్యా వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం స్వామి తన భార్య, కుమార్తెతో అత్తగారి గ్రామమైన వల్లాల గ్రామానికి రెండు వారాల క్రితం వలస వచ్చాడు. బావమరిది బొంత వెంకన్న వద్ద ఉంటూ ఇదే గ్రామానికి చెందిన కట్టగూరి అంజయ్య అనే రైతు భూమిలో బావిని తీసేపనులను నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలోనే సోమవారం పనులకు వెళ్లిన వారు తమ కుమార్తె శాన్విని వెంట తీసుకెళ్లారు.  12 గంటలు బోరుబావిలోనే..అప్పటి వరకుతల్లితో పాటే ఉన్న శాన్వి నిమ్మతోటలో ప్రమాదవశాత్తు వేసిన బోరుగుంతలో పడింది. వెంటనే గమనించిన శాన్వి తల్లిదండ్రులు లబోదిబోమనడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు, అధికారులకు, గ్రామస్తులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3.35 గంటలకు బోరుబావిలో చిన్నారి పడిపోగా 4.30 గంటలకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

చిన్నారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చివరకు 3.10 గంటలకు చిన్నారి శాన్విని బోరుబావిలోంచి బయటకు తీసి అర్ధగంటలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండరాళ్లతో అంతరాయం..
 బోరుబావిలో చిన్నారిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా రెండు భారీ పొక్లెయిన్లతో బావిని తవ్వారు. 150 అడుగుల లోతున్న బోరుబావిలో 25 అడుగుల లోతులో చిన్నారి శాన్వి చిక్కినట్లు అధికారులు గుర్తించారు. అందుకోసం 25 అడుగుల లోతు బావిని తవ్వారు. కానీ సమాంతర బావి అడుగు భాగంలో బండరాళ్లు అడ్డు రావడంతో సహాయక చర్యలకు  ఆటంకం ఏర్పడింది.  వారిని అనుమతించి ఉంటే.. సంఘటన విషయం తెలుసుకుని బోరుబావిలో పడిన చిన్నారులను ప్రత్యేకంగా తయారు చేసుకున్న పనిముట్లతో సురక్షితంగా బయటకు తీసే పనిలో నైపుణ్యత కలిగిన జిల్లాలోని మార్గులపల్లి, కోదాడ, తిప్పర్తి మండలాల చెందిన పలువురు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి తరలివచ్చారు.

చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారిని అందుకు అనుమతించలేదు. దీంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ వారిని అనుమతించి ఉంటే చిన్నారిని బయటకు తీసి ఉండేవారేమోనని, చిన్నారి ప్రాణాలతో బయటపడేదని పలువురు ఆవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల వైఖరిని తప్పుపట్టడంతో పాటు నిర్లక్ష్యవైఖరే శాన్వి ప్రాణాలు తీసిందంటూ దుయ్యబట్టారు.  బావితవ్వకానికి 12 గంటల సమయం బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు బోరుబావికి సమాంతరంగా తీసిన 25 అడుగుల బావితవ్వకానికి 12 గంటల సమయం పట్టింది. వల్లాల గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనుల్లో ఉన్న రెండు భారీ పొక్లెయిన్లు మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పనులు చేపట్టినా సరైన సమయంలో సరైన సలహాలు అధికారుల నుంచి అందకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు.


  బోరు ఫెయిల్ కావడంతోనే..వల్లాల గ్రామానికి చెందిన రైతు కట్టగూరి అంజయ్య తనకున్న నిమ్మతోటలో ఓ వ్యవసాయ బావి తవ్వాడు. కానీ ఆ బావిలో నీరు సరిపడా పడకపోవడంతో పక్కనే  వారంరోజుల క్రితం బోరు వేశాడు. కానీ వేసిన బోరు ఫెయిలయ్యింది. దీంతో ఉన్న వ్యవసాయ బావినే మరింత లోతు తవ్వించేందుకు పనులు చేపట్టాడు. అందులో భాగంగానే వ్యవసాయ బావి తవ్వకం పనులను చిన్నారి శాన్వి తండ్రి వరికుప్పల స్వామి కుదుర్చుకున్నాడు. ఒకవేళ ఆ రైతు వేసిన బోరు పడిఉంటే వ్యవసాయ బావిని మరింత లోతుకు తవ్వేవాడు కాదు.. అతను బావిని తవ్వకుంటే స్వామి వల్లాలకు వలస వచ్చేవాడు కాదు.. స్వామి వల్లాలకు వలస రాకుంటే శాన్వి బతికి ఉండేదని పలువురు వాపోయారు. ఆ బోరు ఫెయిల్ కావడమే దీనంతటికీ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement