పుష్కర్, రక్షిత్ శెట్టి, శాన్వీ, సచిన్
‘‘ప్రాంతీయ భాషా చిత్రాలు దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. అదే ఫ్యూచర్ అవుతుంది అనుకుంటున్నాను. అప్పట్లో ‘రోజా’ దేశవ్యాప్తంగా హిట్ అయింది. తెలుగు నుంచి ‘బాహుబలి’ ప్రభంజనం సృష్టించింది. మా కన్నడం నుంచి ‘కేజీఎఫ్’ వచ్చింది. మా ‘అతడే శ్రీమన్నారాయణ’ కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను’’ అన్నారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, శాన్వీ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’. పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’గా విడుదలవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ – ‘‘దక్షిణ భారతదేశంలో లేని ఒక ఫిక్షన్‌లో ప్లేస్‌లో (ఊహాజనిత ప్రదేశం) జరిగే కథ ఇది. అన్ని ప్రాంతాల వారికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్ అవుతాడు. 8 కోట్ల బడ్జెట్‌తో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సుమారు 30 కోట్లతో నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను 90శాతం సెట్స్‌లోనే చిత్రీకరించాం. సుమారు 19 సెట్లు నిర్మించాం. ఇందులో లవ్, యాక్షన్, సాహసాలు అన్నీ ఉంటాయి’’ అన్నారు నిర్మాత పుష్కర్. ‘‘మూడేళ్ల పాటు చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు సచిన్. ‘‘ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడం హ్యాపీ. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు ‘లవ్లీ’ ఫేమ్ శాన్వీ.
Comments
Please login to add a commentAdd a comment