బోర్ల మరమ్మతుకు భలే పరికరం!
- బోరు నుంచి మోటార్లు, పైపులను
- సునాయాసంగా వెలికి తీసే పరికరాన్ని ఆవిష్కరించిన మెకానిక్
- బోర్ల రిపేరు ఖర్చులో భారీ తగ్గుదల
- బోరు లోతు ఎంత ఉన్నా.. ఇద్దరు మనుషులుంటే చాలు
బోరుబావుల నుంచి కాలిపోయిన మోటార్లను.. పైపులను పైకి తీసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు ఆ యువకుడిని ఆలోచింపజేశాయి. మెకానిక్‌గా తనకున్న అనుభవానికి సృజనాత్మక ఆలోచనను జోడించి బోరు బావుల్లో నుంచి పైపులు, మోటార్‌ను సులభంగా, తక్కువ ఖర్చుతో, కొద్ది సమయంలోనే వెలికి తీసే పరికరాన్ని సావేటి వెంకటేశ్ రూపొందించాడు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలోని కమ్మం నాచారం ఆయన స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వెంకటేశ్ పరిగిలో మోటార్ వైండింగ్ షాపును నడుపుతున్నాడు. మోటారు పాడయినా లేదా బోరులో నీరు అడుగంటినా లేదా లోతు పెంచాలన్నా మోటారును, పైపులను బోరులో నుంచి పూర్తిగా పైకి తీయాల్సిందే. ఒక్కో పైపు 20 అడుగుల వరకు పొడవుంటుంది. ఈ ప్రక్రియ వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో రైతుకు కూలీల ఖర్చు భారమైంది.
బోరుబావి నుంచి నీటిని తోడేందుకు వాడే హ్యాండిల్‌తో పైపులను, మోటారును ఎందుకు వెలికి తీయకూడదు? అని వెంకటేశ్ ఆలోచించాడు. ఈ ఆలోచనే చక్కని పరికరం రూపకల్పనకు దారిచూపింది. నాలుగు అడుగుల ఎత్తుగల మూడు ఇనుప పైపులను వెల్డింగ్ చేస్తే స్టాండ్ సిద్ధం చేశాడు. స్టాండ్ పైభాగంలో ఆరు అడుగుల పొడవు గల ఇనుప పైపును అమర్చాడు. బోరుకు ఉండే హ్యాండిల్ మాదిరిగా ఇది కనిపిస్తుంది. దీనికి పది అడుగుల పొడవైన ఇనుప గొలుసు, దాని చివరన కొక్కెం ఏర్పాటు చేశాడు. హ్యాండిల్‌ను ఒక వ్యక్తి పైకి, కిందకు అంటూ ఉంటే బోరు పైపు ప్రతిసారీ 2 అడుగుల మేరకు పైకి వస్తూ ఉంటుంది. ఈ పరికరం సాయంతో ఎన్ని వందల అడుగుల లోతు బోరులో నుంచైనా పైపులు, మోటార్లను సునాయాసంగా పైకి తీయవచ్చని వెంకటేశ్ (99487 07173) తెలిపాడు.
200 అడుగుల కన్నా ఎక్కువ లోతు తవ్విన బోరుబావుల్లోంచి పైపులు, మోటార్లను పైకి తీసేందుకు 10 మంది మనుషులు రోజంతా శ్రమ పడుతూ ఉంటారు. ఈ పరికరం సహాయంతో ఇద్దరు వ్యక్తులు కేవలం గంటలో పని పూర్తి చేయవచ్చని వెంకటేశ్ తెలిపాడు. మోటార్‌ను పైకి తీసి రిపేర్ చేసి తిరిగి బోరులో అమర్చేందుకు సాధారణంగా రెండు రోజుల సమయం పటే ్టది. ఈ పరికరంతో ఒక్క పూటలోనే పని పూర్తి చేయవచ్చు. దీని బరువు 40 కిలోలు ఉంటుంది. స్కూటర్‌పై సులభంగా తీసుకెళ్లవచ్చు. దీని తయారీకి రూ. 3 వేలు ఖర్చవుతుంది. ఈ పరికరంతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన స్థానిక అధికారులు 55 తాగునీటి బోర్ల నిర్వహణను వెంకటేశ్‌కు అప్పగించారు. ఈ పరికరం ఉపయోగించడం వల్ల ప్రతి బోరు మరమ్మతు ఖర్చులో రూ. 2 వేల వరకు ప్రజాధనం ఆదా అవుతోంది. హేట్సాఫ్ టు వెంకటేశ్!
- కావలి మల్లేశ్, సాక్షి, పరిగి, రంగారెడ్డి జిల్లా