పుల్‌కల్(ఆందోల్): రెండేళ్ల క్రితం బోరు బావిలో పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటనకు సంబంధించి మెదక్ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. భూ యజమానితోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ఎం.వాణి తీర్పు వెలువరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పుల్‌కల్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెంకు చెందిన కుమ్మరి రాములు తన వ్యవసాయ భూమిలో బోరు వేసేందుకు వెంకటేశ్‌కు పనులు అప్పగించాడు. 2015 నవంబర్ 27న బోరు వేసినా.. నీళ్లు పడకపోవడంతో ఆ గుంతను పూడ్చకుండానే వదిలేశారు.
మరుసటి రోజు ఉదయం మూడేళ్ల బాలుడు రాకేశ్ ఆడుకుంటూ వెళ్లి ఆ బోరుబావి గుంతలో పడిపోయాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు 24 గంటలపాటు శ్రమించినా బాలుడిని రక్షించలేకపోయారు. దీంతో భూమి యాజమాని రాములుతోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా మెదక్ సెషన్స్ కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ‘‘ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కావొద్దు. మరణాలకు బాధ్యులైన వారికి సరైన శిక్షలు వేస్తేనే వీటిని నివారించగలుగుతాం. బోర్లు వేసి అలాగే వదిలేయడంతో చిన్నారుల మృతికి కారణమవుతున్నారు’’అని జడ్జి వాణి పేర్కొన్నారు.