సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఒక్క తెలంగాణలోనే రోజుకు ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాం«దీభవన్‌లో చేపట్టిన మౌనదీక్షలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన డిసౌజా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పారీ్టగా మారిపోయిందని, ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలిక రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడి ప్రమేయం చూస్తే తెలంగాణలో పాలిటిక్స్ గూండాగిరీ నడుస్తోందని, మద్యం, డ్రగ్స్ పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, ఆమెకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డిసౌజా చెప్పారు. దీక్షలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నీలం పద్మలతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
డీజీపీకి వినతిపత్రం: అంతకుముందు మహిళా కాంగ్రెస్ నేతలు డిసౌజా, కొండా సురేఖ, సునీతారావు తదితరులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment