సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణ జరిపిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో పోలీసులు రాజకీయ పరికరాలుగా మారారని, ముఖ్యమైన వ్యక్తులను రక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. బుధవారం తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జంగిల్‌రాజ్ నడు స్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన, శాంతిభద్రతలు, ఆడపిల్లల సంరక్షణ ఇలా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులిలా ఉంటే రూ.109 కోట్లు ఖర్చుచేసి వార్తాపత్రికల్లో తన ఫొటోతో ప్రకటనలిచ్చి ప్రచారం చేసుకోవడం గర్హనీయమన్నారు. గత ఏప్రిల్ 22 నుంచి మే 31 దాకా 11–17 ఏళ్ల వయసున్న అనేక మంది బాలికలు అత్యాచారానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా స్పందించేందుకు కేసీఆర్‌కు నోరు కూడా రావడం లేదని మండిపడ్డారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై, కేటీఆర్ ట్విటర్‌తో బిజీగా ఉంటే హోంమంత్రి అనే వ్యక్తి అసలు ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి ఉంది’అని ఎద్దేవా చేశారు. ఓ ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగ్గా అది ఏ శాఖది, ఎవరు ఉపయోగిస్తున్నారన్న వివరాలు ఆరా తీయకుండా.. దాంట్లో ఉన్న ఆధారాలను చెరిపేసే కుట్ర జరుగుతోందన్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం రాష్ట్రాన్ని పంచుకున్నాయి: సంజయ్
జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచారం కేసును ౖముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచి్చన ఆదేశాల మేరకే పోలీసులు నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేటీఆర్ ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్‌కే కళ్లు లేవు.. ఇక దోషుల కళ్లేం పీకుతడు?’అని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం పారీ్టలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నాయని, ఎంఐఎం నాయకులు దాడులు చేస్తుంటే.. టీఆర్‌ఎస్ నేతలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుల పోరాటం వల్లే కేసులు నమోదు చేశారని, బీజేపీ స్పందించకపోతే కేసును మూసేసేవారన్నారు. న్యాయం కోరుతున్న తమ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్ రావులపై కేసు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ధ.. బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టే విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ‘కేసును తప్పు దోవ పట్టించేందుకు ఇందులో హిందువు ఉన్నట్లు మొదటి ఎఫ్‌ఐఆర్‌లో సూరజ్ అనే పేరు నమోదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్ధారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసి, నిందితుల జాబితాలో చివరన చేర్చారు’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment