మోర్తాడ్(బాల్కొండ) : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులను గల్ఫ్ దేశాలు మళ్లీ పిలుస్తున్నాయి. తిరిగి విధుల్లోకి చేరాలంటూ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. కరోనా సంక్షోభంతో గల్ఫ్ దేశాల్లోని అనేక కంపెనీలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. తమపై ఆధారపడిన వలస కార్మికులను ఇంటికి పంపేశాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తుండటంతో కంపెనీలు తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నాయి. విధుల్లో చేరాలంటూ కార్మికులకు ఫోన్లుచేసి పిలుస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, కువైట్ మినహా మిగిలిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, దోహా ఖతర్, ఒమన్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. గత అక్టోబర్ నుంచి యూఏఈ వీసాల జారీ మొదలు కాగా, బహ్రెయిన్ నవంబర్‌లో వీసాల జారీని ప్రారంభించింది. ఒమన్ వారం నుంచి కొత్త వీసాల జారీతో పాటు గతంలో ఇంటికి వెళ్లిన వలస కార్మికులను మళ్లీ రప్పించడానికి వీసాల జారీకి అనుమతినిచ్చింది. ఖతర్‌లో 2022లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు నిర్వహించడనుండటంతో వచ్చే జనవరి నుంచి కొత్త వీసాల జారీకి భారీగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈకి ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయి.
నిర్వహణ రంగంలోనే ఉపాధి అవకాశాలు
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులకు నిర్మాణ రంగంలోనే భారీగా ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే, కరోనా ఉద్ధృతికి ముందే ఈ రంగం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది. కరోనాతో పూర్తిగా కుదేలవ్వడంతో కార్మికుల ఉపాధికి గండిపడింది. ఇప్పుడు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాక నిర్వహణ రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కంపెనీల కార్యాలయాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, ఉద్యోగులకు సహాయపడేందుకు ఆఫీస్ బాయ్స్ వంటి పోస్టులకు ఎంపికలు సాగుతున్నాయి. యూఏఈలో ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో కార్మికుల ఎంపిక కొనసాగుతోంది. బహ్రెయిన్‌లోనైతే హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడంతో ఇంటికి వెళ్లిన కార్మికులను మళ్లీ పిలుచుకుంటున్నారు.
ఒక్కోచోట ఒక్కోలా క్వారంటైన్
యూఏఈకి సంబంధించి దుబాయ్, షార్జాలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను అమలు చేయట్లేదు. అబుదాబిలో మాత్రం ఇంటి నుంచి వచ్చిన వలస కార్మికులు 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. బహ్రెయిన్‌లో వారం రోజుల క్వారంటైన్‌తో సరిపెడుతున్నారు. ఖతర్‌లో మాత్రం కంపెనీలే వలస కార్మికులకు క్వారంటైన్ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
దుబాయ్ రమ్మని కబురొచ్చింది
దుబాయ్‌లోని ఓ కంపెనీలో ప్లంబర్‌గా పనిచేశాను. లాక్‌డౌన్‌తో మూడు నెలల కింద ఇంటికి పంపేశారు. కంపెనీలు మళ్లీ తెరవడంతో పనులు ప్రారంభమవుతున్నాయి. దుబాయ్‌కి రమ్మని కంపెనీ నుంచి కబురు వచ్చింది. అప్పట్లో నాతో పాటు ఇంటికి వచ్చేసిన 20 మందినీ పిలిచారు. – నందు, మోర్తాడ్
కంపెనీ యజమాని ఫోన్ చేశాడు
ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను చేసే మా కంపెనీకి కొన్ని కాంట్రాక్టులు వచ్చాయి. దీంతో నాకు యజమాని ఫోన్ చేశాడు. వీసా, విమాన టిక్కెట్‌ను కంపెనీయే పంపిస్తుంది. నాతో పాటు ఇంటికి వచ్చిన పొరుగు జిల్లాల కార్మికులకూ ఫోన్ రావడంతో దుబాయ్ వెళ్తున్నాం. – కస్ప రమేశ్, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment