ఖమ్మం వైద్యవిభాగం : జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ప్రతీనెల మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా నివారణ చర్యలు తీసుకుంటున్నా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. అయితే, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు అంతగా లేకపోవటంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే! అనధికారికంగా చాలా మంది వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్న నేపథ్యాన కథనం.
3,380 మంది బాధితులు మృతి
జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2006 నుండి ఇప్పటి వరకు 3,380 మంది మృతి చెందగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 310 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 47,487 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు జరపగా 310 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇందులో 28,105 గర్భిణుల్లో పరీక్షలు చేయగా11 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
అలాగే, 15 ఏళ్లలోపు పిల్లలు 80 మంది వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, హెచ్‌ఐవీ బాధితుల కోసం జాగృతి, ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాయి. ఇక జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం నాలుగు ఐసీటీసీ కేంద్రాలు, 36 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్‌టీ కేంద్రం, రెండు లింక్ ఏఆర్‌టీ కేంద్రాలు, ఒక సురక్ష క్లినిక్, 9 రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యాన అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి్సన ఆవశ్యకత ఉందని తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 16,307 పాజిటివ్ కేసులు
జిల్లాలో గత ఏడాది 15,995 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం సంఖ్య పెరిగింది. ఇప్పు డు జిల్లాలో 16,307 పాజిటివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరు ఖమ్మం ఏఆర్‌టీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకున్న వారే కాగా, పేర్లు నమోదు చేసుకోని వారి కూడా ఉంటారని సమాచారం. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిలో ప్రతీనెల క్రమం తప్పకుండా 6,160 మంది మందులు వాడుతుండగా, 2,780 మంది పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణలో ఎయిడ్స్ బాధితుల్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్ తర్వాత ఖమ్మం మూడో స్థానంలో ఉండడం గమనార్హం.
ఎయిడ్స్‌ను తరిమికొట్టేందుకు కృషి
జిల్లా నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మందుల కొరత లేకుండా చూస్తూ, బాధితులందరూ మందులు వాడేలా చూస్తున్నాం. పీహెచ్‌సీలకు వచ్చే వారిలో 10 శాతం తక్కువ కాకుండా హెచ్‌ఐవీ టెస్టులు చేయిస్తున్నాము. ర్యాలీలు, కళాజాతాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ ఎల్. ప్రవీణ, అడిషనల్ డీఎంహెచ్‌ఓ,
ఎయిడ్స్ అండ్ లెప్రసీ
Comments
Please login to add a commentAdd a comment