గుండె లయ తప్పుతోంది | World Heart Day 2020 Special story In Hyderabad | Sakshi
Sakshi News home page

గుండె లయ తప్పుతోంది

Published Tue, Sep 29 2020 8:25 AM | Last Updated on Tue, Sep 29 2020 8:26 AM

World Heart Day 2020 Special story In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శరీరానికి కనీస వ్యాయామం లేని ఉన్నత, మధ్య తరగతి ప్రజల్లోనే కాదు....రోజంతా కాయ కష్టం చేసే పేదల్లోనూ హృద్రోగ సమస్యలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరేళ్లలో ఆరోగ్యశ్రీలో జరిగిన చికిత్సలను పరిశీలిస్తే నిరుపేదల్లో హృద్రోగుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 19,442 మంది ఆరోగ్యశ్రీ పథకంలో గుండె చికిత్సలు చేయించుకున్నారు. 2019 నాటి కి ఈ సంఖ్య 75 వేలు దాటింది.

వీటిలో సగానికిపైగా గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే నగదు చెల్లించి చికిత్స లు పొందిన వారే కాకుండా సీఎంఆర్‌ ఎఫ్, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ, ఆర్టీసీ, రైల్వే, ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు వీరికి అదనం. బాధితుల్లో 60 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

జీవనశైలిలో పెద్ద తేడా లేకపోవడమే
ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత నగరంలో అనేక ఐటీ, అనుబంధ కంపెనీలు వెలిశాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కంపెనీలు ఆయా ఉద్యోగులకు టార్గెట్లు ఇస్తుండటంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇదే సమయంలో చేతిలో పుష్కలంగా డబ్బు ఉండటంతో వీకెండ్‌ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మద్యం, మాంసాహారాలకు అలవాటుపడ్డారు. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి బదులు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో రెడీమేడ్‌గా లభించే ఆహార పదార్థాలను, హానికరమైన శీతల పానియాలను ఎక్కువగా తీసుకుంటున్నారు .అంతేకాదు... పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిలోనూ అనేక మార్పులు వచ్చాయి.

ఫలితంగా ఆహార వ్యవహారాల్లో పేద, ధనికులు అనే తేడా లేకుండా పోయింది. బస్తీల్లోనే కాదు పల్లేల్లోనూ ఫాస్ట్‌ç ఫుడ్‌ సెంటర్లు, బార్లు, వైన్‌ షాపులు వెలిశాయి.  ఇక శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుక పోతోది. దీనికి తోడు చిన్న వయసులోనే అనేక మంది హైపర్‌ టెన్షన్, మధుమేహం వంటి రుగ్మతల భారినపడుతున్నారు.విటమిన్ల లోపం కూడా పరోక్షంగా గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఒకప్పుడు ఆరు పదుల వయసు దాటిన వారిలే కన్పించే ఈ గుండె జబ్బులు ప్రస్తుతం పాతికేళ్ల లోపు యువకుల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి 

  • మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. 
  • జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.  
  • సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచుపదార్థ్దాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
  • రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 
  • పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్‌ లోపాన్ని అధిగమించవచ్చు.  
  • వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను మెరుగు పర్చుకోవడం ద్వారా విటమిన్‌ లోపాలను, ఇన్‌ఫెక్షన్లను అధిగమించొచ్చు. 
  • మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి 
  • పార్కులు, ఇతర అహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు.  

– డాక్టర్‌ ఆర్‌వి కుమార్, డాక్టర్‌ సాయిసుధాకర్‌ 

ఆరోగ్య స్పృహ పెరిగింది 
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం పేద, మధ్య తరగతి ప్రజల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లోనూ కార్డియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఛాతిలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే సమీపంలో ఉన్న కార్డియాలజీ సెంటర్లకు వెళ్లి ఈసీజీ పరీక్షలు చే యించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం హృద్రోగ చికిత్సలు ఎక్కువగా జరుగుతుండటానికి ఇది కూడా ఓ కారణం. – డాక్టర్‌ గోఖలే, కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement