ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ల దందా | wrong reports From city Scan In telnganag | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ల దందా

Published Sun, Aug 9 2020 4:03 AM | Last Updated on Sun, Aug 9 2020 11:49 AM

wrong reports From city Scan In telnganag - Sakshi

వైద్య, ఆరోగ్యశాఖకు అందిన ఫిర్యాదులు.. విచారణకు ఆదేశం అతను ఓ జిల్లా కలెక్టర్‌ సోదరుడు. కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్న అతను... ఈమధ్య ఛాతీ నొప్పితో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. మొదటగా ఎక్స్‌రే తీసిన వైద్య సిబ్బంది అందులో తేడా ఉందంటూ సీటీ స్కాన్‌ తీసి ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉందని తేల్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు... తాను వైద్యం పొందిన డాక్టర్‌కు సీటీ స్కాన్‌ రిపోర్ట్‌ పంపాడు. తనకు శ్వాసకోశ ఇబ్బందులేవీ లేవని పేర్కొన్నాడు. చివరకు అతన్ని పరీక్షించిన వైద్యుడు చాలా యాక్టివ్‌గానే ఉన్నట్లు తేల్చాడు. వాస్తవంగా సీటీ స్కాన్‌ నివేదిక ప్రకారమైతే ఆ బాధితుడు కనీసం మాట్లాడే పరిస్థితి కాదు కదా.. తక్షణమే ఆక్సిజన్‌ బెడ్‌పై పడుకోబెట్టాల్సి ఉంటుంది. మరి సీటీ స్కాన్‌ రిపోర్ట్‌కు, డాక్టర్‌ తేల్చిన విషయానికి మధ్య అంత అంతరం ఉండటానికి కారణమేంటి? 

సాక్షి, హైదరాబాద్‌  : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని సొమ్ము చేసుకొనేందుకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నాయి. సీటీ స్కాన్‌ల నివేదికల పేరుతో భారీ దందా నడిపిస్తున్నాయి. బాధితుల్లో రోగ లక్షణాలు లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు సీటీ స్కాన్‌ నివేదికలను తయారు చేస్తున్నాయి. వాటిని చూపి భయపెట్టి రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స పేరిట రూ. లక్షలు గుంజుతున్నాయి. అనవసరంగా సీటీ స్కాన్‌లు తీయడమే కాకుండా వాటిని మార్ఫింగ్‌ చేయడంపై బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రుల చీటింగ్‌ స్కాన్‌లపై దృష్టి సారించిన వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటువంటి ఆసుపత్రులను గుర్తించి వాటిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ తరహా ఆసుపత్రులపై శనివారం తమకు కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినట్లు ఒక వైద్యాధికారి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అనవసరంగా సీటీ స్కాన్‌లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించాలని కూడా వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

కరోనా నిర్ధారణ కోసం సీటీ స్కాన్‌లు... 
రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షతోపాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా చికిత్సలు చేసే ఆసుపత్రులు మాత్రం వంద వరకు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలతోపాటు యాంటీజెన్‌ పరీక్షలు చేసేవి మొత్తం 1,100 కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీ స్థాయి వరకు యాంటీజెన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేసే అవకాశాలు లేవు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్లను విరివిగా చేస్తున్నాయి. వాటి ఆధారంగానే కరోనా నిర్ధారణ చేస్తున్నాయి. ఒక్కో సీటీ స్కాన్‌కు రూ. 5–6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంట్లో పీపీఈ కిట్ల ధర కూడా కలిపి వేస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకున్నా సీటీ స్కాన్‌ చేయడం తప్పనిసరి చేసిన యాజమాన్యాలు... వాటిని డబ్బు సమకూర్చే యంత్రాలుగా మార్చేశాయి. ఆర్‌టీ–పీసీఆర్‌ కరోనా పరీక్షకు కనీసం 24 గంటల సమయం పడుతుండగా సీటీ స్కాన్‌ ద్వారానైతే ఐదు నిమిషాల్లోనే ఫలితం తెలుసుకొనే వీలుంది. దీన్ని బాధితులు కూడా తక్షణ నిర్ధారణగా భావిస్తున్నారు. 

మార్ఫింగ్‌ జరుగుతోంది ఇలా... 
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బాధితులు చేయించుకొనే సీటీ స్కాన్‌లలో ఎటువంటి వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినా మార్ఫింగ్‌ చేయడం మొదలు పెట్టాయి. సీటీ స్కాన్‌ తీశాక రిపోర్ట్‌ కాపీని మార్చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా సీటీ స్కాన్‌ ఫిల్మ్‌ను కూడా మార్ఫింగ్‌ చేస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేకపోయినా, అటువంటి ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగి ఫిల్మ్‌లో మరో రోగి పేరు ఉండేలా చేసి మార్ఫింగ్‌ చేస్తున్నట్లు తేలిందని ఒక వైద్యాధికారి తెలిపారు. పాత ఫిల్మ్‌లలోని తేదీలను కూడా ఆసుపత్రులు మార్చేస్తున్నాయని, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు చెప్పి బాధితులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకొని రూ. లక్షలు గుంజుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు మరో వైద్యాధికారి తెలిపారు. ఒక కలెక్టర్‌ కుటుంబాన్నే మోసం చేశారంటే పరిస్థితి ఎందాక వచ్చిందో అర్థం చేసుకోవచ్చని, దీనిపై నివేదిక తయారు చేశామని ఒక అధికారి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement