గర్భాలయ ద్వారంపై స్వామి, అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేసిన పసిడి మకరతోరణం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన ఉత్సవాలు సోమవారం మొదలుకానున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా అంకురార్పణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనం, సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం పూజలతో ప్రారంభమవుతాయి. ఈనెల 28 వరకు జరిగే ఆలయ ఉద్ఘాటన కార్యక్రమంలో ప్రతిరోజూ వివిధ రకాల యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. 108 మంది పారాయణికులు, వేద పండితులు బాలాలయంలో ఏడు రోజులపాటు సప్తాహ్నిక పంచకుండాత్మక యాగం నిర్వహిస్తారు. ఇప్పటికే బాలాలయంలోని మహా మండపంలో పంచ కుండాలను ఏర్పాటు చేసి, అందులోకి ప్రవేశించేందుకు ద్వారాలను సైతం అమర్చారు. యాగ మండపం అంతా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలతో సిద్ధం చేశారు. 28వ తేదీన ఉదయం 11.55 గంటలకు మిథున లగ్న ముహూర్తంలో జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సంప్రోక్షణ తరువాత మధ్యాహ్నం 2గంటలకు భక్తులకు శ్రీస్వామి వారి స్వయంభూ దర్శనాన్ని కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
పంచ నారసింహ క్షేత్రం అయినందున..
యాదాద్రీశుడు వెలసింది పంచ రూపాలతో కాబట్టి ఈ పంచ నారసింహ క్షేత్రంలో పంచ కుండాత్మక యాగాన్ని నిర్వహించడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యాగంలో ప్రధానంగా కుండాలను ఆయా దిశల్లో ఏర్పాటు చేశారు. చతురస్ర కుండం దీనిని వాసుదేవ కుండం అంటారు. దీన్ని తూర్పు దిశలో ఏర్పాటు చేశారు. ధనుస్సు కుండం దీనిని సంకర్షణ కుండంగా పిలుస్తారు. దీనిని దక్షిణ దిశలో పెట్టారు. వృత్త కుండం దీనిని ప్రద్యుమ్న కుండం అంటారు. దీన్ని యాగశాలలో పశ్చిమ దిశలో ఏర్పాటు చేశారు. త్రికోణం కుండం దీనిని అనిరుద్ర కుండం అంటారు. దీనిని యాగశాలకు ఉత్తర భాగంలో పెట్టారు. ఇక పద్మ కుండం దీనిని అవసఖ్య కుండం అంటారు. ఈ కుండాన్ని ఈశాన్య దిశలో నిర్మించారు.
నేటి కార్యక్రమాలు
21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వస్తి వాచనం, విష్వక్సేన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమం, వాస్తు పర్వగ్నకరణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 9.30 వరకు మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన ఉంటుంది.
2,167 రోజుల తర్వాత..
ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 2016 ఏప్రిల్ 21న గర్భాలయాన్ని మూసివేసి భక్తుల కోసం బాలాలయం నిర్మించి స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు గర్భాలయంలో అర్చకులు స్వామి వారికి పూజలు నిర్వహించినప్పటికి భక్తులకు మాత్రం దర్శన భాగ్యం కలగలేదు. ఈనెల 28న ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పిస్తారు. అంటే 2,167 రోజుల తర్వాత భక్తులకు స్తంబోద్భవుని దర్శనభాగ్యం కలగనుంది. 28 నుంచి బాలాలయం మూసివేస్తారు.
1,200 కోట్లతో నిర్మాణం
యాదవ మహర్షి తపస్సుతో కొండ గుహలో వెలసిన పంచ నారసింహుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. పూర్వం కీకారణ్యంలోని గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు పూజలు చేస్తుండే వారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి యాదాద్రి క్షేత్రాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. తొలిసారిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద ఆలయం భక్తులకు అందుబాటులోకి వస్తోంది. రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ఆలయం పునర్మిర్మాణ పనుల్లో ప్రధానాలయానికి రూ.248 కోట్లు ఖర్చుచేశారు. పచ్చదనం, సుందరీకరణ, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞానికి ప్రతీకగా యాదాద్రి నూతన ఆలయం నిలువనుంది. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వందల ఏళ్ల క్రితం రాజులు నిర్మించిన పురాతన ఆలయాల అనుభూతి కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment