సాక్షి, యాదాద్రి: కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ మహాక్రతువులో చివరగా మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించి, ప్రధాన ఆలయంలో దర్శనాలను మొదలుపెడతారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంభూ నారసింహుడి వద్ద తొలిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధానాలయంతోపాటు పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు.
పంచాకుండాత్మక యాగం ముగించి..
తొలుత ఉదయం 6.30 గంటలకు బాలాలయంలో హవనం ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగుస్తుంది. అనంతరం స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, ఆళ్వారులు, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్ర నిర్వహించాక మూర్తులను లోనికి తీసుకెళతారు.
ఏకకాలంలో అన్నిచోట్లా..
శోభాయాత్ర అనంతరం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు.
కలశ ప్రతిష్ట, ప్రారంభ పూజలకు అతిథులు వీరే..
మహకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. ప్రధానాలయం విమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. తూర్పు రాజగోపురం వద్ద దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దక్షిణ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, పశ్చిమ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉత్తర రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, పశ్చిమ రాజగోపురం (సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్, తూర్పు రాజగోపురం (త్రితల) వద్ద మంత్రి గంగుల కమలాకర్ పూజలు చేస్తారు.
శ్రీగరుడ ఆళ్వార్ సన్నిధి వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బ్రహోత్సవ మండపం వద్ద మంత్రి కేటీఆర్, ఆళ్వార్ సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్, ఆగ్నేయ ప్రాకార మండపం–3 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాయవ్య ప్రాకార మండపం–18 వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–21 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–22 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈశాన్య ప్రాకార మండపం–23 వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈశాన్య ప్రాకార మండపం–24 వద్ద మంత్రి హరీశ్‌రావు, శ్రీరామానుజ సన్నిధి వద్ద సీఎస్ సోమేశ్‌కుమార్, వాయవ్య ప్రాకార మండపం–17 వద్ద ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పాల్గొంటారు.
జంటలుగా వీఐపీలు
ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న ముఖ్యులు దం పతులతో కలిసి రావాలని ఆహ్వానంలో కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు జంటగా పూజల్లో పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదీ..
► సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో సోమవారం ఉదయం 10.45 గంటలకు యాదాద్రి టెంపుల్ సిటీకి వస్తారు.
► ప్రత్యేక కాన్వాయ్‌లో 10.50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటారు.
► 11.20 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా యాదాద్రి కొండపైకి వస్తారు.
► కేసీఆర్, కుటుంబ సభ్యులు 11.30 గంటలకు ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో పాల్గొంటారు.
► తర్వాత 11.55 గంటలకు ప్రధానాలయ విమాన గోపురం వద్ద మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు.
► 12.30 గంటల సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి గర్భాలయంలో తొలిపూజ చేస్తారు.
► వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకుని.. ఆలయ పునర్నిర్మాణ క్రతువులో పాల్గొన్నవారిని సన్మానిస్తారు.
► మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొండ కింద యాగస్థలంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ భోజనాలు చేస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
పూలు, దీపాలతో అలంకరించి..
మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పూలతో ప్రధానాలయం, మండపాలు, ధ్వజ స్తంభం, గర్భాలయాన్ని ముస్తాబు చేశారు. యాదాద్రి ప్రధానాలయం, పరిసరాలతోపాటు కొండ మొత్తం రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment