ఇటు బ్రహ్మోత్సవం.. అటు సీతారాముల కల్యాణోత్సవం | Yadadri Temple To Be Reopen For Brahmotsavalu February | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకల్లా యాదాద్రి

Published Tue, Jan 26 2021 8:14 AM | Last Updated on Tue, Jan 26 2021 1:26 PM

Yadadri Temple To Be Reopen For Brahmotsavalu February - Sakshi

సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టుగా ఐదేళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఫిబ్రవరిలో ప్రధానాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. వసంత పంచమి అయిన ఫిబ్రవరి 16న లేదా రథ సప్తమి తేదీ అయిన 18న ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ దర్శన భాగ్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, ఫిబ్రవరి 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఇక బ్రహ్మోత్సవాల్లోపు స్వామి వారి దర్శనం ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతోంది. అందుకే కొండపైన పనులన్నీ ఈ నెల 30కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు జరిగిన సమీక్షలో సీఎం ఆదేశించారు. ఈ పనులను 27న సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. అనంతరం ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం చినజీయర్‌ స్వామిని కలసి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించడంపై అనుమతి కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొండ కింద జరుగుతున్న టెంపుల్‌ సిటీ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.(చదవండి: యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు)

ప్రాణ ప్రతిష్టకు ప్రత్యేక పూజలు...
ప్రస్తుతం బాలాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఫొటోలకు స్వామి వారి ఆవాహనం చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో 2016లో భక్తులకు దర్శనం కోసం ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ప్రధానాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పారాయణాలు, మూలమంత్ర జపాలు, యాగం నిర్వహిం చాల్సి ఉంది. అయితే కరోనాకు ముందు సంవత్సరకాలంపాటు మూలమంత్ర జపాలు చేశారు. కరోనాతో నిలిపివేసిన ఈ జపాలను ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మళ్లీ కొనసాగిస్తారా లేక 11 రోజులపాటు మూలమంత్ర జపాలు నిర్వహించి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఒకట్రెండు రోజులు మినహా మే వరకు మూఢా లు ఉండటంతో ప్రారంభ తేదీపై స్పష్టత రావడం లేదన్న వాదన కూడా ఆలయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి
కొండపైన భక్తుల కోసం చేపట్టిన క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రధానాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూ కాంప్లెక్స్‌ పనులు తిరుమల తరహాలో పూర్తికాగా ప్రధానాలయంలో మిగతా పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఆలయం వెలుపల మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్‌ పనులు మరో 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఆలయం చుట్టూ ఏకశిల సాలహార విగ్రహాలు 150 వరకు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 32 విగ్రహాలు యాదాద్రికి చేరుకున్నాయి. మిగతావి నెలాఖరు వరకు రానున్నాయి. వాటిని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రతిష్టించనున్నారు. దీంతోపాటు ఉత్తరం వైపున రిటైనింగ్‌ వాల్‌ను 15 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అది పూర్తి అయితే పుష్కరిణి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆర్చి వరకు పార్కింగ్‌ వసతి కల్పిస్తారు. కొండ కింద చేపట్టిన పుష్కరిణి, అన్న ప్రసాద వితరణ కేంద్రం, బస్టాండ్, రింగ్‌ రోడ్డు, గండి చెరువు ఆధునీకరణ, ప్రెసిడెన్షియల్‌ సూట్, కల్యాణకట్ట పనులు జరుగుతున్నాయి. 

ఏప్రిల్‌ 21న భద్రాద్రి సీతారాముల కల్యాణం
ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 21న సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను సోమవారం ఆలయ ఈఓ బి.శివాజీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందించారు. ఏప్రిల్‌ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మూలమూర్తుల స్నపన తిరుమంజనం, నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది.

అదే రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభం, 17న మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురారోపణం, 18న గరుడ ధ్వ జపట లేఖనము, గరుడ ధ్వజ పటావిష్కరణ, గరు డ ధ్వజాధివాసం, 19న ధ్వజారోహణం, దేవతాహ్వానము, బలి సమర్ప ణ, 20న చతుఃస్థానాచర్చనము, ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీరామనవమి, 22న మహాపట్టాభిషే కం, 23న సదస్యము, 24న చోరోత్సవం, 25న ఊంజల్‌ ఉత్సవం, 26న వసంతోత్సవం, 27న పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఉంటాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొ ని ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు నిత్య కల్యాణోత్సవాలు రద్దు చేశారు. ఏప్రిల్‌ 17 నుంచి 27 వరకు దర్బార్‌ సేవలు రద్దు చేశారు. ప్రస్తుతం కోవిడ్‌–19 నిబంధనలను సడలిం చిన నేపథ్యంలో శ్రీరామనవమిని మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారా.. లేదా ఆంతరంగికంగా నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement