యశ్వంతాపూర్ వాగులో కొట్టుకుపోయిన రైలు బోగీలు(ఫైల్)
సాక్షి, జనగామ: కన్నీళ్లకే కన్నీళ్ల పెట్టించే దుర్ఘటన. వందల మంది ప్రాణాలు తీసిన ఘటన. మళ్లొస్తామనే మాటే ఆఖరి ప్రయాణమైన వేళ.. కుటుంబ సభ్యులకు చివరిచూపును కూడా దూరం చేసింది. చివరి క్షణంలో రైలు మిస్సయినా.. ప్రయానికుడిని పరుగులు పెట్టించి ప్రాణం తీసిన జోరు వర్షం.. దేశ ప్రజలను కంటనీరు పెట్టిస్తే... నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రిని రాజీనామా చేయించిన మహా విషాదం అది. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు వద్ద రైలు ప్రమాద సంఘటనకు నేటి(ఆదివారం)తో 66 ఏళ్లు పూర్తవుతున్నాయి. యావత్ భారతదేశాన్ని కుదిపివేసిన ఈ ప్రమాదంపై కథనం.
1954 సెప్టెంబర్ 27
సరిగ్గా 66 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్ 27న సోమవారం రాత్రి 10.10 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీకి గ్రాండ్ టాక్ పేరుతో వెళ్లే(నిజాముద్దీన్) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోతగా కురుస్తున్న వర్షం సవ్వడి వినిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గంట సేపటి తర్వాత రాత్రి 11.15 గంటలకు జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకుంది. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రైలు పట్టాలను మూడు అడుగుల మేర ముంచేసింది. అయితే, సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ మామూలుగానే వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.
నాడు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశం
ఇంతలోనే 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి. 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. చిమ్మచీకట్లో ఏం జరుగుతుందో తెలియిని పరిస్థితుల్లో మిగతా బోగీల్లోని వారంతా హాహాకారాలు చేశారు. సమాచార వ్యవస్థ అంతగా లేని సమయంలో రైలు ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకు దేశానికి తెలియలేదు. రైలు ప్రమాద ఘటనను తెల్లవారుజామున తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం వాగు వద్దకు చేరుకుని అధికారులకు సాయపడ్డారు.
కుటుంబాల్లో విషాదం నింపిన ప్రయాణం
నిజాముద్దీన్ రైలు ప్రయాణం వందలాది కుటుంబాల్లో పెను విసాదాన్ని నింపింది. ప్రసార మాధ్యమాలు, సెల్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో రైలు ప్రమాదం దేశ ప్రజలకు ఆలస్యం తెలిసింది. యశ్వంతాపూర్ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని రేడియో ద్వారా తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన చోటకు చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో తమవారు కనిపించక పోవడంతో దుఖాఃన్ని ఆపుకోలేక పోయారు. దీంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు పిక్కటిల్లాయి. చెట్టుకొకరు, పుట్టకొకరు, కిలోమీటర్ల దూరంలో కొట్టుకుపోయిన మృతదేహాలు ఛిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న కొందరు క్షేమంగా ఉన్నా సమాచారం లేకపోవడతో బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన రాత్రి నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి.
మంత్రి రాజీనామా
యశ్వంతాపూర్ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శా ఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి తన పదవికి వెంటనే రాజీ నామా చేశారు. తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పిన మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అప్పట్లో సంచలనం కలిగింది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు.
రైలు మిస్సయినా...
సికింద్రాబాద్ స్టేషన్‌లో నిజామొద్దీన్ రైలు మిస్ కావడంతో కారులో భువనగిరి వరకు వచ్చి రైలు ఎక్కిన ఓ వ్యాపారికి అదే చివరి ప్రయాణంగా మిగిలి పోయింది. హైదరాబాద్ ప్యారడైజ్ థియేటర్ యజమాని ప్రాణాలు భువనగిరిలో రైలు ఎక్కిన 35 నిమిషాలకే అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వ్యాపారిని రైలు రూపంలో వచ్చిన మృత్యువు వెంటాడినట్లుగా చెబుతారు. అలాగే ఈ ప్రమాదంపై అనేక మూఢ నమ్మకాలు, విపరీతమైన ప్రచారాలు అప్పట్లో జరిగాయి. రైలు ప్రమాదం గురించి మాట్లాడితే చాలు...నేటికి వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో రైలు ప్రమాదాన్ని నెమర వేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు.
తల్లి ఒడిలో చిన్నారి
రాత్రి రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని ‘అమ్మ’ అక్కడే తుది శ్వాస విడిచింది. తల్లి మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్లవార్లు ఎక్కెక్కి ఏడ్చింది. ఉదయం వాగు వద్దకు వెళ్లిన గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు విని అక్కడకు వెళ్లారు. తల్లి చనిపోవడంతో పాపను తీసుకుని రైల్వే అధికారులకు అప్పగించారు. గుండెలను పిండేసే ఆ ఘటనను గుర్తుకు చేసుకున్న 90ఏళ్ల మల్లయ్య కన్నీళ్ల పర్యంతమయ్యారు.
శవాలను మోసిన..
రైలు ప్రమాద సమయంలో నా వయస్సు 25 ఏండ్లు. వాగులో రైలు కొట్టుకుపోయిందని తెలిసింది. తెల్లవా రుజామున 6 గంటల సమయంలో వాగు వద్దకు చేరుకున్నా. పుట్టకొకరు.. గుట్టకొకరు పడిఉన్నారు. మనుసు ద్రవించింది. వాగులో కొట్టుకుపోయి, చెట్ల పొదల్లో ఇరుక్కుపోయిన శవాలు...రోదనలు,. కుటుంబ సభ్యులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వెంటనే రైలు అధికారులతో కలిసి శవాలను ఒడ్డుకు చేర్చా. ఆనాటి ఘటన తలుచుకుంటే గుండెలను పిండేస్తుంది. – కాశ మల్లయ్య, 90 ఏళ్ల వృద్ధుడు, యశ్వంతాపూర్
బాయి కాడికి పోతుంటే..
రైలు పట్టాల పక్కనే మా వ్యవసాయ బావి ఉంది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో నా వయస్సు 15 ఏళ్లు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నాయినతో కలి సి బయలుదేరిన. వాగు పక్క కు వెళ్లగానే బిగ్గర అరుపులు వినిపించాయి. నాయినా ఎ వరో పిలుస్తున్నారు అంటుండగానే... దూరంగా ఏవో డబ్బాలు పడిపోయినట్లుగా కనిపించాయి. నాయినతో కలిసి అక్కడకు ఉరికిన. అక్కడ వందల సంఖ్యలో చని పోయిన వారు కనిపించడంతో భయంతో ఏడ్చిన. బావి కాడికి ఎప్పుడు వెళ్లినా అదే ఘటనే గుర్తుకొస్తుంది. – కాముని మల్లేశం, యశ్వంతాపూర్
Comments
Please login to add a commentAdd a comment