yashwanthpur express
-
వార్‌జోన్‌ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్‌లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్‌కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్‌మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్, కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్‌జోన్‌ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్‌కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్‌కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్‌లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్‌కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్‌ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
ఎంతో మందికి శోకాన్ని మిగిల్చింది.. ఆ విషాదానికి 67 ఏళ్లు
సాక్షి, జనగామ(హైదరాబాద్): అన్నా క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. ఏవండి ఢిల్లీలో దిగగానే ఉత్తరం రాయండి.. సమయానికి భోజనం చేయడం మరచిపోకండి.. అంటూ ఆప్యాయతల పలకరింపుల అనంతరం రైలెక్కిన గంటకే ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన. ఒక్కటి కాదు.. రెండు కాదు.. మూడు వందల మందిని బలిగొన్న మహాప్రమాదం. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు రైలు ప్రమాద ఘటన జరిగి నేటికి (సోమవారం) 67 ఏళ్లు పూర్తవుతున్నాయి. నాటి ప్రమాదంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 67 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 27న.. సరిగ్గా 67 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్ 27న సోమవారం రాత్రి 10.10 నిమిషాలకు సికాంద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గ్రాండ్ టాక్ పేరుతో(నిజాముద్దీన్) ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని ప్రయాణికులంతా నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోత వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గంట తర్వాత రైలు జనగామ స్టేషన్‌కు చేరుకుంది. యశ్వంతాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడే 5 నిమిషాల పాటు నిలిపివేశారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో బయలుదేరిన రైలు సరిగ్గా 11.15 నిమిషాలకు యశ్వంతాపూర్ వాగుపైకి చేరుకునే సమయంలో మూడు అడుగుల మేర పట్టాలు మునిగిపోయాయి. సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ రైలును ముందుకు తీసుకెళ్లాడు. 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. ఏం జరుగుతుందో తెలియక మిగతా బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ కాలంలో సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడంతో రైలు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెల్లవారుజాము వరకు దేశానికి తెలియలేదు. ఆ తర్వాత సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని అధికారులకు సహకరించారు. రైలు మిస్సైయినా.. వెంటాడిన మృత్యువు సికింద్రాబాద్ స్టేషన్లో నిజామొద్దీన్ రైలు మిస్ కావడంతో.. ఓ వ్యాపారి కారులో భువనగిరి వరకు వచ్చి, ఉరుకులు.. పరుగుల మీద రైలెక్కాడు. అతడికి అదే చివరి ప్ర యాణంగా మిగిలిపోయింది. హైదరాబాద్ ప్యారడైజ్ థి యేటర్ యజమాని అంజయ్య.. సికింద్రాబాద్ చేరుకునే సరికే రైలు వెళ్లిపోవడంతో కారులో భువనగిరి వచ్చి రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన 35 నిమిషాలకే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాగా, ఈ ప్రమాదం గురించి మాట్లాడితే ఈ ప్రాంతానికి చెందిన వృద్ధులు నేటికి కన్నీ టి పర్యంతమవుతారు. రైలు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు. కుటుంబాలు చిన్నాభిన్నం.. నిజాముద్దీన్ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. సమాచార వ్యవస్థ సరిగాలేని నాటి రోజుల్లో ఈ ప్రమాద విషయం దేశానికి ఆలస్యంగా తెలిసింది. యశ్వంతాపూర్ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని తెలుసుకున్న బాధిత కుటుంబాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. తమవారు కనిపించకపోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో పిక్కటిల్లింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు.. కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు చిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న పలువురు క్షేమంగా ఉన్నప్పటికీ.. సమాచారం లేకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రైల్వే మంత్రి రాజీనామా యశ్వంతాపూర్ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ.... ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తల్లి ఒడిలో చిన్నారి.. రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని తల్లి అక్కడే మృతి చెందింది. అమ్మ మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్ల వార్లు ఎక్కిక్కి ఏడ్చింది. ఉదయం వ్యవసాయ పనులకు బయలుదేరిన యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లాడు. తల్లి చనినపోవడంతో పాపను రైల్వే అధికారులకు అప్పగించాడు. అమ్మమ్మ ఇంటి కాడ నుంచి వచ్చిన.. వాగులో రైలు కొట్టుకుపోయిన రాత్రి అమ్మమ్మ ఇంటి కాడ తాటికొండలో ఉన్న. విషయం తెలియగానే కాలినడకన పరుగు పరుగున వచ్చిన. ఆ సమయంలో నాకు పదేళ్ల వయస్సు. ఇంటికి వచ్చి నాయినతో కలిసి సక్కగా వాగు వద్దకు వెళ్లిన. చెల్లా చెదురుగా ఉన్న రైలు బోగీలు, ఏ చెట్టుకు చూసినా శవాలే కనిపించాయి. దుఖం ఆపుకోలేక పోయిన. చిన్నచిన్న చంటిపాపలూ ఉన్నారు. ఆనాటి ఘటన గుర్తుకు చేసుకుంటే రోజంతా బాధగానే ఉంటుంది. - కాముని మల్లేశం, యశ్వంతాపూర్ సంటి పిల్లతల్లిని కాపాడిన.. పొద్దుగాలనే నిద్రలేచి పొలం పనులకు బయలుదేరిన. వాగు వద్దకు వెళ్లగానే ఎవరో అరచినట్టుగా వినిపించింది. మొదటగా నీళ్ల సప్పుడు అనుకున్న. దగ్గరకు వెళ్లి చూస్తే పెద్ద పెద్ద డబ్బాలు కనిపించాయి. ఓ చెట్టును పట్టుకుని కిందకు దిగితే ఓ తల్లి చేతిలో బిడ్డను పట్టుకుని కాపాడండి అంటూ అరుస్తుంది. భయపడకు అంటూ ముందుకు వెళ్లిన. అన్నా నా బిడ్డను కాపాడు.. రాత్రి నుంచి చెట్టును పట్టుకున్నా.. ఇక ఓపిక లేదు అంటూ ఏడ్చింది. చెట్టుకున్న ఓ పొడవాటి కర్రను విరిచి ఆ తల్లి చేతికి ఇచ్చి పట్టుకోమని చెప్పిన. పది నిమిషాల పాటు కష్టపడి ఇద్దరిని కాపాడిన. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తుంది. - మారబోయిన పుల్లయ్య, 90ఏళ్లు, యశ్వంతాపూర్ చదవండి: ‘నంబర్ వన్’ టార్గెట్టే ముంచిందా! -
రైలు ప్రమాదం: మంత్రి రాజీనామాకి 66 ఏళ్లు
సాక్షి, జనగామ: కన్నీళ్లకే కన్నీళ్ల పెట్టించే దుర్ఘటన. వందల మంది ప్రాణాలు తీసిన ఘటన. మళ్లొస్తామనే మాటే ఆఖరి ప్రయాణమైన వేళ.. కుటుంబ సభ్యులకు చివరిచూపును కూడా దూరం చేసింది. చివరి క్షణంలో రైలు మిస్సయినా.. ప్రయానికుడిని పరుగులు పెట్టించి ప్రాణం తీసిన జోరు వర్షం.. దేశ ప్రజలను కంటనీరు పెట్టిస్తే... నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రిని రాజీనామా చేయించిన మహా విషాదం అది. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు వద్ద రైలు ప్రమాద సంఘటనకు నేటి(ఆదివారం)తో 66 ఏళ్లు పూర్తవుతున్నాయి. యావత్ భారతదేశాన్ని కుదిపివేసిన ఈ ప్రమాదంపై కథనం. 1954 సెప్టెంబర్ 27 సరిగ్గా 66 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్ 27న సోమవారం రాత్రి 10.10 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీకి గ్రాండ్ టాక్ పేరుతో వెళ్లే(నిజాముద్దీన్) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోతగా కురుస్తున్న వర్షం సవ్వడి వినిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గంట సేపటి తర్వాత రాత్రి 11.15 గంటలకు జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకుంది. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రైలు పట్టాలను మూడు అడుగుల మేర ముంచేసింది. అయితే, సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ మామూలుగానే వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. నాడు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశం ఇంతలోనే 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి. 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. చిమ్మచీకట్లో ఏం జరుగుతుందో తెలియిని పరిస్థితుల్లో మిగతా బోగీల్లోని వారంతా హాహాకారాలు చేశారు. సమాచార వ్యవస్థ అంతగా లేని సమయంలో రైలు ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకు దేశానికి తెలియలేదు. రైలు ప్రమాద ఘటనను తెల్లవారుజామున తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం వాగు వద్దకు చేరుకుని అధికారులకు సాయపడ్డారు. కుటుంబాల్లో విషాదం నింపిన ప్రయాణం నిజాముద్దీన్ రైలు ప్రయాణం వందలాది కుటుంబాల్లో పెను విసాదాన్ని నింపింది. ప్రసార మాధ్యమాలు, సెల్ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో రైలు ప్రమాదం దేశ ప్రజలకు ఆలస్యం తెలిసింది. యశ్వంతాపూర్ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని రేడియో ద్వారా తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన చోటకు చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో తమవారు కనిపించక పోవడంతో దుఖాఃన్ని ఆపుకోలేక పోయారు. దీంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు పిక్కటిల్లాయి. చెట్టుకొకరు, పుట్టకొకరు, కిలోమీటర్ల దూరంలో కొట్టుకుపోయిన మృతదేహాలు ఛిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న కొందరు క్షేమంగా ఉన్నా సమాచారం లేకపోవడతో బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన రాత్రి నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. మంత్రి రాజీనామా యశ్వంతాపూర్ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శా ఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి తన పదవికి వెంటనే రాజీ నామా చేశారు. తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పిన మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అప్పట్లో సంచలనం కలిగింది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. రైలు మిస్సయినా... సికింద్రాబాద్ స్టేషన్లో నిజామొద్దీన్ రైలు మిస్ కావడంతో కారులో భువనగిరి వరకు వచ్చి రైలు ఎక్కిన ఓ వ్యాపారికి అదే చివరి ప్రయాణంగా మిగిలి పోయింది. హైదరాబాద్ ప్యారడైజ్ థియేటర్ యజమాని ప్రాణాలు భువనగిరిలో రైలు ఎక్కిన 35 నిమిషాలకే అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వ్యాపారిని రైలు రూపంలో వచ్చిన మృత్యువు వెంటాడినట్లుగా చెబుతారు. అలాగే ఈ ప్రమాదంపై అనేక మూఢ నమ్మకాలు, విపరీతమైన ప్రచారాలు అప్పట్లో జరిగాయి. రైలు ప్రమాదం గురించి మాట్లాడితే చాలు...నేటికి వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో రైలు ప్రమాదాన్ని నెమర వేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు. తల్లి ఒడిలో చిన్నారి రాత్రి రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని ‘అమ్మ’ అక్కడే తుది శ్వాస విడిచింది. తల్లి మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్లవార్లు ఎక్కెక్కి ఏడ్చింది. ఉదయం వాగు వద్దకు వెళ్లిన గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు విని అక్కడకు వెళ్లారు. తల్లి చనిపోవడంతో పాపను తీసుకుని రైల్వే అధికారులకు అప్పగించారు. గుండెలను పిండేసే ఆ ఘటనను గుర్తుకు చేసుకున్న 90ఏళ్ల మల్లయ్య కన్నీళ్ల పర్యంతమయ్యారు. శవాలను మోసిన.. రైలు ప్రమాద సమయంలో నా వయస్సు 25 ఏండ్లు. వాగులో రైలు కొట్టుకుపోయిందని తెలిసింది. తెల్లవా రుజామున 6 గంటల సమయంలో వాగు వద్దకు చేరుకున్నా. పుట్టకొకరు.. గుట్టకొకరు పడిఉన్నారు. మనుసు ద్రవించింది. వాగులో కొట్టుకుపోయి, చెట్ల పొదల్లో ఇరుక్కుపోయిన శవాలు...రోదనలు,. కుటుంబ సభ్యులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వెంటనే రైలు అధికారులతో కలిసి శవాలను ఒడ్డుకు చేర్చా. ఆనాటి ఘటన తలుచుకుంటే గుండెలను పిండేస్తుంది. – కాశ మల్లయ్య, 90 ఏళ్ల వృద్ధుడు, యశ్వంతాపూర్ బాయి కాడికి పోతుంటే.. రైలు పట్టాల పక్కనే మా వ్యవసాయ బావి ఉంది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో నా వయస్సు 15 ఏళ్లు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నాయినతో కలి సి బయలుదేరిన. వాగు పక్క కు వెళ్లగానే బిగ్గర అరుపులు వినిపించాయి. నాయినా ఎ వరో పిలుస్తున్నారు అంటుండగానే... దూరంగా ఏవో డబ్బాలు పడిపోయినట్లుగా కనిపించాయి. నాయినతో కలిసి అక్కడకు ఉరికిన. అక్కడ వందల సంఖ్యలో చని పోయిన వారు కనిపించడంతో భయంతో ఏడ్చిన. బావి కాడికి ఎప్పుడు వెళ్లినా అదే ఘటనే గుర్తుకొస్తుంది. – కాముని మల్లేశం, యశ్వంతాపూర్ -
తప్పిన ముప్పు
సోమవారం అర్ధరాత్రి దాటింది ... మంగళవారం వేకువ జాము ... యశ్వంత్‌పూర్–టాటానగర్ (12890) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో బోగీలో మంటలు... ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికుల్లో ఆందోళన ... వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేసి ప్రయాణికులను దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్యాంట్రీకార్ బోగీ పూర్తిగా దగ్ధమైపోగా ఎస్–1 బోగీ స్వల్పంగా దెబ్బతింది. గొల్లప్రోలు (పిఠాపురం): స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో భారీ రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో యశ్వంత్‌పూర్ – టాటానగర్ (12890) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్యాంట్రీ కార్ బోగీ పూర్తిగా కాలిపోయింది. ఎస్–1 బోగీ స్వల్పంగా దెబ్బతింది. సిబ్బంది అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. ఈ రైలు రాత్రి 1.47 గంటలకు గొల్లప్రోలు నుంచి కిలోమీటరు దూరం వెళ్లేసరికి 9వ బోగీగా ఉన్న ప్యాంట్రీ కారు నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో టీటీఈ, ప్యాంట్రీ కారు మేనేజర్ చైను లాగారు. మిగిలిన బోగీలకు మంటలు వ్యాపించకుండా ప్యాంట్రీ కారును లోకో పైలట్, గార్డు, సిబ్బంది వేరు చేశారు. అప్పటికే ఎస్–1 బోగీలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను దింపేసి ఆ బోగీని కూడా వేరు చేశారు. ఎస్–1లో ఉన్న ప్రయాణికులు ఆందోళనతో ట్రైన్ దిగేందుకు పరుగులు తీయడంతో టీటీఈ రాజేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతనిని వెంటనే సామర్లకోట రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఈ ట్రైన్లో మొత్తం 23 బోగీలు ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్యాంట్రీ కారు, ఎస్–1 బోగీ రైలుకు 9, 10వ బోగీలుగా ఉన్నాయి. తొలుత స్థానిక రైల్వేస్టేషన్‌లోని అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం పిఠాపురం, పెద్దాపురం, కాకినాడకు చెందిన ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాలి బూడిదైన బోగీ మంటలు ఒక్కసారి చుట్టుముట్టడంతో ప్యాంట్రీ కారు క్షణాల్లో కాలి బూడిదైంది. ఈ బోగీలో ఉన్న బియ్యం, నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు, వంట సామగ్రి, ఫర్నిచర్ మొత్తం పూర్తిగా కాలిపోయాయి. అయితే గ్యాస్ సిలెండర్లకు మంటలు వ్యాపించకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. భీతావహులైన ప్రయాణికులు అర్ధరాత్రి.. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదంతో భీతావహులయ్యారు. ప్యాంట్రీ కారులో ఉన్న సిబ్బంది, ఎస్–1 బోగీలోని ఉన్న ప్రయాణికులు హాహాకారాలతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ట్రైన్ నుంచి ఒక్క ఉదుటున బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక మిగిలిన బోగీల్లోని వారు కూడా భయంతో రైలు దిగి పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన బోగీలను వేరు చేశారని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఆరు గంటల పాటు.. ప్రమాదం జరిగిన తరువాత రైలు ఇంజిన్‌కు అనుసంధానంగా ఉన్న 7 బోగీలను సమీపంలోని రావికంపాడు రైల్వేస్టేషన్‌కు తరలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత 8 గంటల సమయంలో మిగిలిన బోగీలను వేరే ఇంజిన్‌తో అక్కడకు తరలించారు. ఎస్–1 బోగీ స్థానంలో మరో బోగీని విశాఖలో జత చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం సుమారు 9 గంటల సమయంలో రావికంపాడు రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు టాటానగర్‌కు బయలు దేరింది. కాలిపోయిన బోగీలను గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌కు తరలించారు. దీంతో సుమారు ఆరు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి సమయంలో రైలు దిగి పట్టాలపైనే ఉండిపోయారు. తాగడానికి నీళ్లు లేక, పిల్ల లకు పాలు లేక అవస్థలు పడ్డారు. స్థానికులు, అధికారుల సహాయం విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీఓ రాజకుమారి ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబు, తహసీల్దార్ రవికుమార్, రెవెన్యూ, నగర పంచాయతీ సిబ్బంది ప్రయాణికులకు తాగునీరు, బిస్కెట్లు, టిఫిన్లు, అరటిపండ్లు అందజేశారు. స్థానికులు వారికి వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రమాదంపై పలు అనుమానాలు ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ పీక నిర్లక్ష్యంగా కాల్చి పారేయడం వల్ల జరిగిందా? అగ్గిపెట్టె వెలిగించడం వల్ల జరిగిందా? అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ – 1 బోగీ సమీపం నుంచే మంటలు వ్యాపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ దక్షిణ మధ్య రైల్వే జీఎం మాల్యా యశ్వంత్‌పూర్ – టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. సంఘటన స్థలాన్ని, కాలిపోయిన ప్యాంట్రీ కారు, ఎస్–1 బోగీలను ఆయన పరిశీలించారు. ప్యాంట్రీ కారు లోపలి భాగం పరిశీలించి, ప్రమాదానికి కారణాలపై, ప్యాంట్రీ కారులో ఉన్న సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరుపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ కమర్షియల్ మేనేజర్, ఎలక్ట్రికల్ సర్వీసెస్ చీఫ్ ఇంజినీర్‌తో కూడిన బృందం విచారణ చేస్తుందని తెలిపారు. ప్రమాద కారణాన్ని వెంటనే చెప్పలేమన్నారు. ప్యాంట్రీ కారులో ఆయిల్స్, కూరగాయలు, ఇతర వస్తువులు ఉండడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. బోగీ పూర్తిగా దెబ్బతిందని, నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ప్యాంట్రీ మేనేజర్, టీటీఈ , రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణహాని జరగలేదన్నారు. ప్రయాణికులకు తాగునీరు, ఫలహారం అందజేశామని తెలిపారు. ఎస్–1 బోగీ స్థానంలో మరో బోగీని విశాఖపట్నంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ రైల్వే డివిజన్ అదనపు మేనేజర్ ఎం.రామరాజు, ఏసీఎం కమలాకర్ బాబు, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఎండీఎన్ఏ ఖాన్, సీఐ రామయ్య తదితరులు సంఘటన స్థలం వద్ద ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రయాణికుల తరలింపు, సాంకేతిక ఇబ్బందులను పర్యవేక్షించారు. కాకినాడ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామయ్య ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై రామకృష్ణ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
నిడదవోలు : రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. యశ్వంత్ పూర్–హౌరా ఎక్స్‌ప్రెక్ నిడదవోలు స్టేషన్ నుంచి విశాఖ వైపు వెళ్తుడగా చిన్నకాశీరేవు సమీపంలోని రైల్వేట్రాక్‌ను తైలమ్మ(70) అనే వృద్ధురాలు దాటుతోంది. ఆమెను గమనించిన లోకోపైలట్ సడన్ బ్రేక్ వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రైలు వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన తైలమ్మను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. తైలమ్మ స్థానిక చర్లసుశీల వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఇంజన్లో సమస్య.. 30 నిమిషాలు నిలిచిన రైలు బ్రేక్ వేసిన సమయంలో ఇంజన్లో సమస్య తలెత్తడంతో 30 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గేటు వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్‌స్టేషన్ వరకు, ఇటువైపు శెట్టిపేట వరకు వాహనాలు బారులు తీరాయి. పట్టణ ఎస్ఐ భగవాన్ ప్రసాద్ రైల్వే మేనేజర్ ఆకుల ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.