Rescuers Try To Raise Buried Coach At Triple Rail Crash Site - Sakshi
Sakshi News home page

వార్‌జోన్‌ను తలపించిన ప్రమాద స్థలం..

Published Sun, Jun 4 2023 4:52 AM | Last Updated on Sun, Jun 4 2023 11:24 AM

Rescuers try to raise buried coach at triple rail crash site - Sakshi

భీతావహంగా కనిపిస్తున్న ప్రమాద స్థలి

బాలాసోర్‌/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్‌ హెల్త్‌ యూనిట్స్‌ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్‌ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్‌లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్‌కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు.

కంపార్ట్‌మెంట్‌ నుంచి విసిరేసినట్టుగా..  
‘రైల్వే ట్రాక్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షీదాబాద్‌ జిల్లాకు చెందిన బ్రెహంపూర్‌ వాసి పీయూష్‌ పోద్దార్‌ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్‌ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్‌ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్‌ ఫోన్‌ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్‌ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు.  

స్థానికుల సహాయం..  
‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్‌ కట్టడం వంటి సాయం చేశామని కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్‌మెన్‌ దీపక్‌ బేరా తెలిపారు.  

యుద్ధ వాతావరణం..  
క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్‌ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్‌ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్‌జోన్‌ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు.

శవాల గుట్టలతో...  
ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. 

ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి!
రైలు ప్రమాద బాధితుల అనుభవాలు
కోల్‌కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్‌కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్‌లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది.

అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్‌కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరినట్లు మిజాన్‌ ఉల్‌ హక్‌ చెప్పారు. ‘బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్‌ బెర్త్‌ నుంచి కిందపడిపోయా.

కంపార్ట్‌మెంట్‌లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్‌ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన హక్‌ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్‌ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్‌ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్‌కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్‌ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement