
సూర్యాపేట: ఎస్‌ఐ కొలువుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడి కల నెరవేరకుండానే ఊపిరి ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (24) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు.
తదుపరి నిర్వహించే శారీరక, దేహ దారుఢ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం పరుగు సాధన చేస్తున్నాడు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం పరుగు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్‌కం దాబా హోటల్‌లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment