ఇల్లెందుకు వృద్ధి ఫలాలు
ఇల్లెందు: నియోజకవర్గంలో సాగిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ముల్కనూరు సమీపంలో గల పాకాల ఏటిపై మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2009 మార్చి 2న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి జీఓ జారీ చేశారు. రూ.131.67 కోట్ల వ్యయంతో 5 వేల ఎకరాలకు సాగునీరు, 29 గ్రామాలకు మంచినీరు అందించేలా నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన హఠాన్మరణంతో ఇది నిలిచింది. కామేపల్లి మండలంలోని తాళ్లగూడెంలో 2005 మే 6వ తేదీన జరిగిన ప్రజాపథంలో పాల్గొన్న వైఎస్సార్ తాళ్లగూడేనికి 50 గృహాల మోడల్ కాలనీ మంజూరు చేశారు. ఇక్కడి చెరువు వద్ద ఆయన స్వయంగా అరక దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2005లో బయ్యారం చెరువుకు గండి పడగా మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. మర్రిగూడెం వద్ద గల ముసలమ్మ వాగు వద్ద చెరువు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు హామీ ఇచ్చి రెండోమారు అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నాటి రాజీవ్ సాగరే.. నేటి సీతారామ ప్రాజెక్ట్
అశ్వాపురం: జలయజ్ఞం పథకంలో భాగంగా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా 2003లో దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రూపకల్పన చేశారు. 2003లో కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ పనులు కూడా కొంత వరకు జరిగాయి. అనంతరం పెద్దాయన హఠాన్మరణంతో ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌లో భాగంగా సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరుమార్చి ప్రస్తుతం నిర్మిస్తోంది. మూడో దశ వరకు పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే..వైఎస్సార్ హయాంలోని ప్రాజెక్ట్ డిజైన్‌లో పినపాక నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరందేలా ఉండగా..సీతారామ ప్రాజెక్ట్ డిజైన్‌లో దానికి మినహాయింపునిచ్చారు.
కిన్నెరసాని కాల్వలతో వేల ఎకరాలకు సాగునీరు
పాల్వంచరూరల్: పాల్వంచ, పినపాక, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు కిన్నెరసాని జలాలను సాగునీరుగా అందించారు. జలయజ్ఞంలో భాగంగా 2005 డిసెంబర్ 31న పాల్వంచకు వచ్చిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి రూ.37 కోట్ల వ్యయంతో కిన్నెరసాని జలాల తరలింపునకు కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయి..నేటికీ జలాలు అందుతున్నాయి. తద్వారా ఇక్కడి వేలాదిమంది రైతులకు రెండు పంటలు పండే భాగ్యాన్ని ప్రసాదించారు. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలతో అనేక మందికి అండగా నిలిచారు.
మున్నేరు ప్రాజెక్ట్ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కలిసిన గుమ్మడి నర్సయ్య, తదితరులు (ఫైల్)
నర్సన్నా.. నేరుగా వచ్చి కలువు
ఇల్లెందు: విద్యుత్ పోరాటంలో తనతో కలిసి పోరాడిన నాటి ఇల్లెందు ఎమ్మెల్యే, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత గుమ్మడి నర్సయ్య అంటే వైఎస్సార్‌కు ప్రత్యేక గౌరవం ఉండేది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య ఓటమి చెంది చాలా కాలం తర్వాత ఇల్లెందు అభివృద్ధి కోసం వెళ్లగా..ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్ ఆప్యాయంగా తన గదిలోకి ఆహ్వానించారు. ‘నర్సన్నా నువ్వు ఓడిపోవడం ఏమిటన్నా’ అంటూ బాధపడ్డారు. ‘ ఏ పని ఉన్నా నేరుగా వచ్చి కలువు అన్నా..’ అంటూ అక్కడ ఉన్న తన ప్రత్యేక కార్యదర్శులకు సూచించినట్లు గుమ్మడి నర్సయ్య వైఎస్సార్ జ్ఞాపకాలను గతంలో నెమరవేసుకున్నారు.
నడుస్తూ..కష్టాలు వింటూ
ఇల్లెందు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగింది. 2003 మే 5వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి..బయ్యారం చేరుకోగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనేక సమస్యలను తెలుసుకుని..2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా వాటికి పరిష్కారం చూపారు. పాదయాత్ర సందర్భంగా బయ్యారం పెద్ద చెరువును శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పర్చాలని రైతులు విన్నవించారు. గుండ్ల వీరస్వామి అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేదరికంలో మగ్గుతున్న విషయం తెలుసుకుని..నాటి సుజాతనగర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి..పింఛన్ మంజూరు చేయించాలని సూచించారు. అలిగేరు, గుంపెళ్లగూడెం, ముల్కనూరు, దుబ్బగూడెం మీదుగా గార్లకు పాదయాత్ర సాగింది. తర్వాతి రోజు లింగాల గ్రామానికి చేరుకుని రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగృహంలో బస చేశారు. మరుసటి రోజు కొత్తలింగాల క్రాస్‌రోడ్ మీదుగా ముచ్చర్ల క్రాస్‌రోడ్, పండితాపురం, రఘునాథపాలెం, బల్లెపల్లిల మీదుగా ఖమ్మానికి చేరుకున్నారు.
బయ్యారంలో వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్ర (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment