ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయమై బీజేపీ తన విధానాన్ని ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం చట్టసభలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు, కేంద్రస్థాయిలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జా తీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు ఆళ్ల రామకృష్ణ, వెంకన్న గౌడ్, మెట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీల మహాధర్నా చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మోదీపైనే బీసీల ఆశలు
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతాన్ని సుప్రీంకోర్టు తొలగించడంతో ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీల సమస్యల పరిష్కారం విషయంలో బీసీలంతా ప్రధాని నరేంద్ర మోదీపైనే ఆశలు పెట్టుకున్నారని, మోదీ హయాంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే చరిత్ర క్షమించబోదని అన్నారు.
లోక్‌సభలో ఉన్న 94 మంది బీసీ ఎంపీలు పార్టీలకతీతంగా బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీసీ ఎంపీలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. వచ్చే జనగణనలో తప్పనిసరిగా కులాలవారీగా బీసీ జనాభా గణన చేయాలని కోరారు. పులులు తదితర జంతువుల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం బీసీ జనగణనకు మాత్రం అభ్యంతరాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా బీసీలు బీజేపీపై తిరగబడతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment