
తల్లిపాలే తొలి వ్యాక్సిన్
● రోటరీ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్ దామోదరం
తిరుపతి సిటీ : తల్లిపాలే బిడ్డకు తొలి వ్యాక్సిన్ అని రోటరీ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్ టెంకాయల దామోదరం తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. తిరుపతి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ సహకారంతో గత ఏడాది ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశామన్నారు. ఏడాదిలో 1,086మంది ఆరోగ్యవంతమైన తల్లుల నుంచి సుమారు 247లీటర్ల పాలను సేకరించామని వెల్లడించారు. ఆ పాలను 3,475మంది పిల్లలకు అందించి ప్రాణాలు నిలబెట్టామని వివరించారు. తల్లిపాలు సేకరించి నెలలు నిండక ముందే జన్మించినవారు, తక్కువ బరువుతో పుట్టినవారు, తల్లికి దూరమైన బిడ్డలకు ఉచితంగా అందించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో ప్రధానంగా ముగురు మాతృమూర్తులు ఒక్కొక్కరు 20, 22, 34 లీటర్లు పాలను తల్లిపాలనిధికి అందించడం విశేషమని, అందులో ఓ డాక్టర్ సైతం ఉండటం అభినందనీయమని తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం ప్రసూతి ఆస్పత్రిలోని మిల్క్ బ్యాంక్‌లో తొలి వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోము రవికుమార్, సెక్రటరీ రాజేష్‌కుమార్, కో చైర్మన్ హేమచంద్ర, రుయా విశ్రాంత సూపరింటెండెంట్ భారతి, విశ్రాంత ప్రొఫెసర్ రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
తిరుపతి ఎడ్యుకేషన్ : జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4, 7 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 8వ తేదీ మధ్యాహ్నం సెషన్‌లో బీఈ, బీటెక్ అభ్యర్థులకు నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ బీఆర్క్, బీప్లానింగ్ విద్యార్థులకు పరీక్షను నిర్వహించనున్నారు.
రుయాలో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా:తిరుపతి రుయా ఆస్పత్రిలో ఐదేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె మండలం ఆరోగ్యపురం గ్రామానికి చెందిన గణేష్ నాయక్ కుమార్తె అక్షర (5) అనే బాలికకు, పుట్టుకతో యోని నుంచి మూత్రం నిరంతరం కారుతోంది. దీంతో బాలిక తల్లిదండ్రులు రుయాలోని చిన్న పిల్లల వైద్యనిపుణుడు బి.జగదీష్‌ను ఆశ్రయించారు. బాలికను పరీక్షించిన వైద్యుడు ఈ మేరకు శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వెంటనే వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్‌లో అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ రాధ, డాక్టర్ ఎస్‌ఎస్ రావు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మనోహర్ పాల్గొన్నారు. వైద్యబృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రావు అభినందించారు.