
దాచేసి..దోచేసి!
● రేషన్ బియ్యంలో గోల్‌మాల్ ● 783.15 మెట్రిక్ టన్నులు తినేసిన డీలర్లు ● తనిఖీలు చేపట్టనున్న అధికారులు
తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ డీలర్ల మాయాజాలం మొదలైంది. గత వైఎస్సార్‌సీపీ సర్కారులో స్వాహా చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆకలి మీదున్న చౌక దుకాణదారులకు ఇప్పుడు యథేచ్ఛగా భోంచేసే సమయం వచ్చింది. దీంతో ఇష్టారాజ్యంగా రేషన్ బియ్యం బొక్కేయడం ప్రారంభించారు. పౌరసరఫరాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు లెక్కలు పంపే వరకు జిల్లా అధికారులకు అసలు సంగతి బోధపడలేదు. గత ఆరునెలలుగా డీలర్లు దాదాపు 783.15 మెట్రిక్ టన్నుల స్టాక్‌ను నిల్వ చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించలేదు. అయితే రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఏ డీలర్ వద్ద ఎంత బియ్యం స్టాక్ ఉందో జాబితా పంపడంతో ఇప్పుడు మేల్కొన్నారు. దీంతో తనిఖీలు చేపట్టి బియ్యం లెక్కలు తేల్చడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే చౌకదుకాణాలకు 8,395.12 మెట్రిక్ టన్నులను మార్చిలో పంపితే, ఈ నెలలో మాత్రం డీటర్ల వద్ద నిల్వలను మినహాయించి 7,611.15 మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేశారు.
జిల్లా సమాచారం
చౌక దుకాణాలు 1,457
రేషన్ కార్డులు 5.91లక్షలు
మార్చిలో సరఫరా చేసిన బియ్యం
8395.12 మెట్రిక్ టన్నులు
ఈనెల పంపింది 7,611.15 మెట్రిక్ టన్నులు
ఆరునెలలుగా వ్యాపారం
గత ఆరునెలలుగా రేషన్ డీలర్లు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా కొద్ది కొద్దిగా బియ్యం దాచేసి, బయటి మార్కెట్‌లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల పౌరసరఫరాలశాఖ అధికారులు తగ్గించి బియ్యం సరఫరా చేయడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లుగా స్టాక్‌లో చూపకుండా అమ్ముకున్న బియ్యం ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక కార్డుదారులను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో బియ్యం ఇవ్వలేమని, మొత్తం కోటాను వచ్చే నెలలో ఇస్తామని బతిమాలుకుంటున్నట్లు తెలిసింది. కొందరు డీలర్లు మరో అడుగు ముందుకేసి కేజీ బియ్యానికి రూ.10 చొప్పున ఇస్తాం సర్దుకోండని నచ్చజెబుతున్నట్లు చర్చసాగుతోంది. ఇదే క్రమంలో కందిపప్పు పంపిణీలో సైతం డీలర్లు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
బియ్యం ఇవ్వాల్సిందే..
మార్చితో పోల్చుకుంటే ఈ నెలలో 783.15 మెట్రిక్ టన్నుల బియ్యం తక్కువగా డీలర్లకు సరఫరా చేశాం. . అయితే ఆ బియ్యం తమ వద్ద స్టాక్ ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు. మరోసారి డీలర్ల వద్దకు వెళ్లి నిల్వలను తనిఖీ చేస్తాం. ప్రతి కార్డుదారుడికీ తప్పనిసరిగా బియ్యం ఇవ్వాల్సిందే. ఎవరైనా బియ్యం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తే తప్పకుండా సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటాం. మరోవైపు కందిపప్పు స్టాక్ ఉందని కొందరు డీలర్లు డీడీలు కట్టలేదు. దీంతో కందిపప్పును తక్కువగానే పంపించాం.
– శేషాచలం రాజు, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి

దాచేసి..దోచేసి!

దాచేసి..దోచేసి!