
స్లాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తిరుపతి అర్బన్: జిల్లా కేంద్రమైన తిరుపతి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పైలెట్ ప్రాజెక్టుగా శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో 17 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో తిరుమలలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలు మిగిలిన 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో మాత్రమే స్లాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. వారం రోజుల తర్వాత జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా తొలి రోజు అయిన శుక్రవారం తిరుపతిలో 22 స్లాట్స్ మాత్రమే బుక్ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ విభాగానికి తగ్గిన రాబడి
గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రాబడిపై లెక్కలను వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.782.68 కోట్ల మేర ప్రభుత్వం టార్గెట్ విధించగా.. అందులో రూ.696.58 కోట్ల వరకు వచ్చినట్టు అధికారులు వివరించారు. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.153.77 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. చిన్నగొట్టిగల్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం రూ.5.54 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది.